Karnataka Polls : కర్ణాటక ఎన్నికల్లో వారసుల సందడి

ABN , First Publish Date - 2023-04-21T18:34:51+05:30 IST

వారసత్వ రాజకీయాలపై పదే పదే విమర్శలు చేసే బీజేపీ సైతం వారసులను దూరంగా పెట్టలేకపోతోంది. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో అన్ని ప్రధాన

Karnataka Polls : కర్ణాటక ఎన్నికల్లో వారసుల సందడి
BS Yediyurappa, Vijayendra

బెంగళూరు : వారసత్వ రాజకీయాలపై పదే పదే విమర్శలు చేసే బీజేపీ సైతం వారసులను దూరంగా పెట్టలేకపోతోంది. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలూ ఉన్నత స్థాయి నేతల వారసులకు టిక్కెట్లు ఇచ్చాయి. వారి బలాన్ని పార్టీ కోసం ఉపయోగించుకోవాలంటే వారికి టిక్కెట్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్ర నేత బీఎస్ యెడియూరప్ప (BS Yediyurappa) ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ ఆయన బీజేపీ తరపున ప్రధాన ప్రచారకర్తగా ప్రచారం చేస్తున్నారు. ఆయన కుమారుడు విజయేంద్ర (Vijayendra)ను శివమొగ్గ జిల్లాలోని శికారిపుర నియోజకవర్గం నుంచి బీజేపీ నిలిపింది. యెడియూరప్ప గతంలో ఈ స్థానం నుంచే పోటీ చేసి, విజయం సాధించారు.

కాంగ్రెస్‌లో పరిస్థితి విభిన్నంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Former chief minister Siddaramaiah)ను వరుణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నిలిపింది. ఆయన కుమారుడు యతీంద్ర 2018లో ఈ స్థానం నుంచి పోటీ చేశారు. ఈసారి యతీంద్రకు కాంగ్రెస్ టిక్కెట్ లభించలేదు.

కర్ణాటకలో మూడో ప్రధాన పార్టీ జేడీఎస్. ఇది ముఖ్యంగా ఓ కుటుంబం నడుపుతున్న పార్టీ. ఈ పార్టీ వ్యవస్థాపకుడు హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) కొంత కాలంపాటు ప్రధాన మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కూడా ఆయన రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్నారు. ఆయన కుమారుడు హెచ్‌డీ కుమార స్వామి (HD Kumaraswamy) రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.

కుమార స్వామి 2018లో చన్నపట్న, రామనగర శాసన సభ నియోజకవర్గాల నుంచి గెలిచారు. రామనగర స్థానానికి రాజీనామా చేసి, ఆయన సతీమణి అనిత చేత పోటీ చేయించారు. ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఈసారి ఆయన చన్నపట్నకు పరిమితమవుతున్నారు. ఆయన కుమారుడు నిఖిల్‌కు రామనగర టిక్కెట్ ఇచ్చారు.

కుమార స్వామి సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ (HD Revanna) సోదరుని సతీమణి భవాని కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. హసాన్ నియోజకవర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ కుమారస్వామి అంగీకరించకుండా రేవణ్ణను హోలెనర్సిపుర నుంచి బరిలో దించారు. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ ప్రస్తుతం జేడీఎస్ ఏకైక ఎంపీ. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన హసాన్ నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గం దేవె గౌడకు కంచుకోట వంటిది. దేవె గౌడ తుమకూరులో పోటీ చేసి, ఓడిపోయారు. ప్రజ్వల్ సోదరుడు సూరజ్ ఎమ్మెల్సీగా చేస్తున్నారు. జేడీఎస్ కింగ్‌మేకర్‌గా నిలుస్తుండటం విశేషం.

కాంగ్రెస్ నేతలు రామలింగారెడ్డి, ఆయన కుమార్తె సౌమ్య బీటీఎం లేఅవుట్, జయ నగర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇది రాజకీయాల్లో తండ్రీకూతుళ్ల కాంబినేషన్.

కాంగ్రెస్‌లో తండ్రీకొడుకుల అనుబంధం కూడా కనిపిస్తోంది. ఎం కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియ కృష్ణ కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయ నగర్, గోవింద రాజ్ నగర్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో అన్నదమ్ముల సవాల్‌ను కూడా చూడవచ్చు. మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప కుమారులు సోరబ్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. బీజేపీ అభ్యర్థిగా కుమార్ బంగారప్ప పోటీ చేస్తున్నారు. ఆయన సోదరుడు మధు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను సవాల్ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో మధును కుమార్ ఓడించారు.

సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మార్గరెట్ అల్వా వారసుడిగా నివేదిత్ అల్వా ఈ ఎన్నికల్లో కుమ్టా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సిటింగ్ బీజేపీ ఎంపీ కరాడి సంగన్న కోడలు మంజుల బీజేపీ టికెట్‌పై కొప్పల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. బీజేపీ నేత అరవింద్ లింబావలి సతీమణి బెంగళూరులోని మహదేవపుర నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నేత ఆనంద్ సింగ్ తన స్థానం విజయనగరను తన కుమారుడు సిద్ధార్థకు ఇచ్చారు. ఈ స్థానం నుంచి సిద్ధార్థ బీజేపీ టిక్కెట్‌పై బరిలో నిలిచారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా వారసత్వ రాజకీయాలకు చెందినవారే. ఆయన తండ్రి ఎస్ఆర్ బొమ్మై గతంలో ముఖ్యమంత్రిగా పని చేశారు.

ఇవి కూడా చదవండి :

NCERT : పదో తరగతి సిలబస్‌లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ఆగ్రహం

Coca Cola Company : 35 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి అప్పగించనున్న కోకా-కోలా కంపెనీ

Updated Date - 2023-04-21T18:34:51+05:30 IST