Karnataka Assembly Elections: ఆ ఫార్ములా మళ్లీ సక్సెస్ అవుతుందా?

ABN , First Publish Date - 2023-04-17T22:14:45+05:30 IST

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఊహించినట్టే ఈసారి కూడా బీజేపీ(BJP)...

Karnataka Assembly Elections: ఆ ఫార్ములా మళ్లీ సక్సెస్ అవుతుందా?
BJP Formula in Karnataka Assembly Elections

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఊహించినట్టే ఈసారి కూడా బీజేపీ(BJP) ముస్లింలకు ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదు. ప్రారంభంలో ఒకరిద్దరికి టికెట్‌ ఇస్తారని వినిపించినా పార్టీ అధిష్టానం పెద్దలు ఇందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మైనారిటీల ఓట్లు అధికంగా ఉండి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం కమలనాథులు వారి పేర్లను కనీసం పరిశీలించలేదు కూడా. బెంగళూరులో ఏదో ఒక నియోజకవర్గాన్ని మైనారిటీలకు ఇస్తారని వినిపించినా ఇప్పటికే నగరంలోని మొత్తం 28 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 224 స్థానాలకుగాను బీజేపీ ఇంతవరకు 222 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీరిలో ఒక్క ముస్లిం అభ్యర్థిగానీ, క్రైస్తవ అభ్యర్థిగానీ లేరు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లోనూ మైనారిటీలకు సీట్లు దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బీజేపీ తీరును కాంగ్రెస్‌, జేడీఎస్‌(JDS) తప్పుబట్టాయి. బీజేపీ.. మైనారిటీలకు ఏనాడూ ప్రాధాన్యత ఇవ్వలేదని జేడీఎస్‌ వ్యాఖ్యానించింది. గత శాసనసభ ఎన్నికల్లోనూ మైనారిటీలకు ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదు. చివరికి బీజేపీ ప్రభుత్వంలో మైనారిటీ మంత్రిత్వశాఖను కూడా ఇతరులే నిర్వహించాల్సి వచ్చింది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లోనూ ముస్లింలకు టికెట్‌ ఇవ్వరాదని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే ఫార్ములాను కర్ణాటకలో వరుసగా రెండోసారి అమలు చేశారు.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-17T22:14:48+05:30 IST