Karnataka : వంట గ్యాస్ సిలిండర్‌కు కాంగ్రెస్ నేతల పూజలు.. బీజేపీ ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా...
ABN , First Publish Date - 2023-05-10T14:33:48+05:30 IST
కాంగ్రెస్ పార్టీ నేతలు అకస్మాత్తుగా ప్రతిదానినీ పూజించడం ప్రారంభించారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (BJP MP Tejasvi Surya) అన్నారు.
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ నేతలు అకస్మాత్తుగా ప్రతిదానినీ పూజించడం ప్రారంభించారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (BJP MP Tejasvi Surya) అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (DK Shivakumar), ఆ పార్టీ నేతలు వంట గ్యాస్ సిలిండర్‌ను పూజించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. వారు ఏదో ఓ దానిని పూజించడం స్వాగతించదగినదేనని తెలిపారు.
డీకే శివ కుమార్, కాంగ్రెస్ నేతలు ఎల్‌పీజీ సిలిండర్లను పూజించడం ప్రారంభించారని, కనీసం ఏదో ఓ దానిని పూజించడం మంచిదేనని తేజస్వి సూర్య చెప్పారు. బజరంగ్ బలి దేవాలయాలను సందర్శించడం, వంట గ్యాస్ సిలిండర్లలో దేవుడిని చూడటం మంచిదేనని చెప్పారు. ప్రతిదానిలోనూ దేవుడు ఉన్నాడని హిందూ ధర్మం చెప్తోందన్నారు. కాంగ్రెస్ ఏదో ఓ పూజ చేస్తుండటం తమకు సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మంగళవారం డీకే శివ కుమార్ ఓ వంట గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేసి, హారతి ఇచ్చారు. ఓటు వేయడానికి వెళ్లడానికి ముందు సిలిండర్‌కు పూజ చేయాలని పిలుపునిచ్చారు. ఈ వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘‘మీరు ఓటు వేయడానికి వెళ్లడానికి ముందు గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేయండి’’ అని గతంలో నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పిన మాటలను వాయిస్ ఓవర్‌లో వినిపించారు.
శివ కుమార్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘గతంలో మోదీ గారు చెప్పారు చూడండి. ఆయన చెప్పినదానినే నేను ఇప్పుడు చెప్తున్నాను. సోదర, సోదరీమణులారా, వంట గ్యాస్ సిలిండర్ రూ.445 నుంచి రూ.1,200 అయింది. మన ప్రధాన మంత్రి కోరిక మేరకు మీరు మీ ఓటు వేయండి. గ్యాస్ సిలిండర్ల మీద పూలదండ వేయండి’’ అని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి :
Karnataka Election : ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. : ప్రముఖులు
Bajrang Dal row : మూర్ఖత్వానికి ఉదాహరణ.. కాంగ్రెస్‌పై నిర్మల సీతారామన్ ఆగ్రహం..