Mamata Banerjee: అనుమతి లేని రూట్లు, ఆయుధాలతో ఊరేగింపులు..బీజేపీపై దీదీ ఫైర్

ABN , First Publish Date - 2023-04-03T17:34:46+05:30 IST

శ్రీరామనవవి శోభాయాత్రల్లో చెలరేగిన అల్లర్లపై భారతీయ జనతా పార్టీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ..

Mamata Banerjee: అనుమతి లేని రూట్లు, ఆయుధాలతో ఊరేగింపులు..బీజేపీపై దీదీ ఫైర్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో శ్రీరామనవవి శోభాయాత్రల్లో చెలరేగిన అల్లర్లపై భారతీయ జనతా పార్టీని (BJP) టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తప్పుపట్టారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే మైనారిటీ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించిందని అన్నారు. హుగ్లీ (Hooghly) జిల్లాలోని రిషర, సెరంపూర్‌‌లో రామనవమి ఊరేగింపు సందర్భంగా ఆదివారం రెండు వర్గాల మధ్య తాజా ఘర్షణలు తలెత్తడంపై సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఠాకూర్‌నగర్ గ్రౌండ్స్‌లో సోమవారంనాడు జరిగినపబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో మమత మాట్లాడుతూ... ''రామ నవవి ఊరేగింపులు ఐదు రోజులు ఎందుకు తీశారు? నవమి రోజునే చాలా ఊరేగింపులు జరిపించి ఉండవచ్చు. అందుకు మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ, మీతో ఆయుధాలను తీసుకెళ్లకూడదు'' అని అన్నారు. వాళ్లు (బీజేపీ) ఉద్దేశపూర్వకంగానే మైనారిటీలున్న ప్రాంతాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించారని, ఆదివారం సైతం ఊరేగింపుల్లో పాల్గొన్న వారు ఆయుధాలతో కనిపించారని మమతా బెనర్జీ చెప్పారు. కాగా, హౌరా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత గురు, శుక్రవారం జరిగిన అల్లర్లతో ప్రమేయమున్న 45 మందిని ఇంతవరకూ పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2023-04-03T17:34:46+05:30 IST