BJP: సిద్దూ ప్రభుత్వం డిసెంబరులో కూలిపోవడం ఖాయం..
ABN , First Publish Date - 2023-06-20T12:00:39+05:30 IST
అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరులో కూలిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరులో కూలిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్(BJP state president Nalin Kumar Kateel) జోస్యం చెప్పారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ అన్నభాగ్య ద్వారా 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బెంగళూరు పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే బియ్యానికి సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ఫొటో పెట్టుకుని పంపిణీ చేశారని తెలిపారు. తాము కొవిడ్ క్లిష్ట సమయంలోనూ బియ్యం పంపిణీ చేశామని గుర్తు చేశారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. కాసియాతోపాటు పరిశ్రమల సమాఖ్యలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయని, వారికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పట్టును వీడాలని, లేదంటే పరిశ్రమలు నడపడం కూడా కష్టమేనన్నారు. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చామని, చార్జీలు పెంచలేదన్నారు. తాము అమలులోకి తెచ్చిన మతమార్పిడి నియంత్రణ, గోవధ నిషేధం బిల్లులను రద్దు చేయడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. బిల్లులు రద్దు చేసేందుకు సాధ్యమవుతుంది కానీ, విద్యుత్ చార్జీలు తగ్గించలేరా..? అని ప్రశ్నించారు. వారు మంగళవారం తలపెట్టిన నిరసన ఎంత జోరుగా చేస్తే అంతే స్థాయిలో కేంద్రం నుంచి 5 కిలోల బియ్యం ఉచితంగా ప్రజల్లోకి చేరుతుందన్నారు. శాసనసభ సమావేశాల నాటికి ప్రతిపక్షనేతను ఎన్నుకుంటామన్నారు. ఎక్కడా వివాదం లేదన్నారు.