BJP: నేడు హస్తినకు బీజేపీ రాష్ట్ర చీఫ్... అమిత్‌షా, నడ్డాతో భేటీ
ABN , First Publish Date - 2023-10-01T08:02:06+05:30 IST
ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే వైదొలగిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(BJP state chief Annamalai) ఆదివారం ఢిల్లీకి బయలుదేరి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే వైదొలగిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(BJP state chief Annamalai) ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చడం, పర్యవసానంగా కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలగడం తదితర పరిణామాలపై బీజేపీ జాతీయ నాయకులతో ఆయన చర్చించనున్నారు. ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే వైదొలగడంపై బీజేపీ రాష్ట నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం పాటిస్తున్నారు. అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు కుదుర్చుకునేందుకు పార్టీ అధిష్ఠానం ప్రయత్నించే అవకాశం ఉండటం వల్లే అన్నాడీఎంకేను విమర్శించడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నామలై ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను ఆయన కలుసుకోనున్నారు. అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి వైదొలగినా నష్టం లేదని, రాష్ట్రంలో పార్టీకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతోందని అన్నామలై అధిష్థానానికి ఇప్పటికే నివేదించారని స్థానిక నాయకులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒకటీరెండు సీట్ల కోసం అన్నాడీఎంకే నేతల వద్ద అర్రులు చాచటం కన్నా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మంచిదని అన్నామలై భావిస్తున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్ కలిగిన పీఎంకే, డీఎండీకే(DMDK)లతో కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదని కూడా అన్నామలై జాతీ యనేతల వద్ద పేర్కొన్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే తన ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే తాను పాదయాత్ర చేపడుతున్నానని అన్నామలై వివరిస్తున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుసుకుని అన్నాడీఎంకే వైదొలగడానికి గల కారణాలను వివరించడంతో పాటు అక్టోబరు 3న పార్టీ జిల్లా శాఖల నాయకుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపైనా సూచనలు తీసుకోనున్నారు.