Congress : జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం ప్రమాదకరం : ఖర్గే
ABN , First Publish Date - 2023-04-14T17:18:17+05:30 IST
గొంతు నొక్కడం, వ్యక్తులను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం ప్రమాదకర ధోరణి అని, దీనివల్ల ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని,
న్యూఢిల్లీ : గొంతు నొక్కడం, వ్యక్తులను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం ప్రమాదకర ధోరణి అని, దీనివల్ల ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని, రాజ్యాంగం ధ్వంసమవుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge) చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) జయంతి సందర్భంగా ఖర్గే ఈ సందేశం ఇచ్చారు.
పార్లమెంటు చర్చా వేదికగా కాకుండా, యుద్ధ క్షేత్రంగా మారిందని, ఇలా మార్చినది ప్రతిపక్షాలు కాదని, అధికార పక్షమేనని ఖర్గే ఆరోపించారు. దేశ రాజకీయాల్లో వ్యక్తి పూజ వల్ల కలిగే దుష్ఫలితాల గురించి అంబేద్కర్ హెచ్చరించారని గుర్తు చేశారు. అంబేద్కర్ చేసిన అద్భుత సేవలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే ప్రజాస్వామిక సిద్ధాంతాలను అంబేద్కర్ సమర్థించారని చెప్పారు.
భారత దేశం, భారతీయ సమాజం ఆర్థిక, సాంఘిక రంగాల్లో పరివర్తన చెందాలని అంబేద్కర్ బలంగా కోరుకున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయనను తాము గౌరవిస్తామన్నారు. కుల వివక్ష, స్త్రీ, పురుష అసమానతలు, విభజన రాజకీయాలను అంతం చేయడానికి అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. పటిష్టమైన వ్యవస్థల ఏర్పాటు కోసం ఆయన విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఆరోజుల్లో ఆయన ప్రముఖ ఆర్థికవేత్త అని, అందువల్ల ఆయన భారత దేశ వ్యవసాయ రంగ అభివృద్ధికి కూడా కృషి చేశారని చెప్పారు. నీటి వనరుల నిర్వహణ, బ్యాంకింగ్ రంగం కోసం కృషి చేశారన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు రూపకల్పనకు కూడా ఆయనే బాటలు పరిచారని చెప్పారు.
అంబేద్కర్, ఆధునిక భారత నిర్మాతలు నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్, నేతాజీ సుభాశ్ చంద్రబోస్ వంటివారు కలలుగన్న రాజ్యాంగ ప్రజాస్వామ్యపు పునాదులు తీవ్ర అపాయకర స్థితిలో ఉన్నాయని చెప్పారు. పార్లమెంటు చర్చా వేదికగా కాకుండా, యుద్ధ క్షేత్రంగా మారిందని, ఇలా మార్చినది ప్రతిపక్షాలు కాదని, అధికార పక్షమేనని తెలిపారు. 1949 నవంబరులో రాజ్యాంగ సభలో అంబేద్కర్ ముగింపు ప్రసంగాన్ని ఖర్గే గుర్తు చేశారు.
‘‘రాజ్యాంగం పని తీరు పూర్తిగా దాని స్వభావంపై మాత్రమే ఆధారపడదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ వంటి రాజ్యం యొక్క అవయవాలను మాత్రమే రాజ్యాంగం ఇస్తుంది. రాజ్యం యొక్క ఈ అవయవాలు ఏ విధంగా పని చేస్తాయనేది ప్రజలు, రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉంటుంది. తమ ఆకాంక్షలు, రాజకీయాలను నెరవేర్చుకోవడానికి ఇవి ఉపకరణాలుగా ఉపయోగపడతాయి. భారతీయులు, వారి పార్టీలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో ఎవరు చెప్పగలరు?’’ అని అంబేద్కర్ అన్నారని ఖర్గే చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం, ఉద్యమకారులు, ప్రభుత్వేతర సంస్థలు, న్యాయ వ్యవస్థ, మీడియా, సామాన్య పౌరులు - వీరిలో ఎవరినైనా నిర్బంధించడం ద్వారా మౌనంగా ఉండేలా చేసే సంస్కృతి, వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేసే సంస్కృతి చాలా ప్రమాదకరమని, దానివల్ల మన ప్రజాస్వామ్యం అంతమవుతుందని, రాజ్యాంగం ధ్వంసమవుతుందని చెప్పారు. రాజకీయాల్లో వ్యక్తి పూజ వల్ల కలిగే దుష్ఫలితాల గురించి అంబేద్కర్ హెచ్చరించారన్నారు. భక్తి లేదా వ్యక్తి పూజ ప్రపంచంలోని ఇతర దేశాల్లో కన్నా మన దేశ రాజకీయాల్లో ఎక్కువ పాత్ర పోషిస్తుందని చెప్పారన్నారు. మతంలో భక్తి వల్ల ఆత్మ మోక్షం పొందడానికి దారి తీయవచ్చునని, అయితే రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తి పూజ కచ్చితంగా పతనానికి బాటలు వేస్తుందని, అంతిమంగా నియంతృతానికి దారి తీస్తుందని చెప్పారని తెలిపారు. ప్రజాస్వామ్యం పతనమవడానికి, నియంతృత్వానికి అవకాశం ఇవ్వాలా? మన రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను కాపాడటానికి, పరిరక్షించడానికి ప్రయత్నించాలా? అనే అంశాలపై ఆత్మావలోకనం చేసుకోవలసిన సమయం ఇది అని తెలిపారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే సార్వజనీన విలువలను అంబేద్కర్ సమర్థించారని తెలిపారు. ఈ విలువలే మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తాయని చెప్పారు. ఆ విలువలే మనకు దిక్సూచి అని తెలిపారు. ఆయన జయంత్యుత్సవాల సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి :
America : దశాబ్దంలో అతి పెద్ద ఇంటెలిజెన్స్ లీక్.. 21 ఏళ్ళ యువకుడి అరెస్ట్..