INDIA alliance: రాజకీయ కూటములను నియంత్రించలేం: హైకోర్టుకు తెలిపిన ఈసీ
ABN , First Publish Date - 2023-10-30T20:51:04+05:30 IST
రాజకీయ కూటములను నియంత్రించే చట్టబద్ధమైన అధికారాలు తమకు లేవని ఢిల్లీ హైకోర్టుకు భారత ఎన్నికల కమిషన్ తెలియజేసింది. 26 పార్టీల కూటమికి 'ఇండియా' పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టుకు ఈసీ సోమవారం తమ అభిప్రాయాన్ని తెలియచేసింది.
న్యూఢిల్లీ: రాజకీయ కూటములను (Political Alliances) నియంత్రించే చట్టబద్ధమైన అధికారాలు తమకు లేవని ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) భారత ఎన్నికల కమిషన్ (ECI) తెలియజేసింది. 26 పార్టీల కూటమికి 'ఇండియా' (INDIA) పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టుకు ఈసీ సోమవారం తమ అభిప్రాయాన్ని తెలియచేసింది. ఇదే సమయంలో 'ఇండియా' (INDIA alliance) పేరు చట్టబద్ధత అంశంపై దీన్ని తమ స్పందనగా భావించరాదని స్పష్టం చేసింది.
కొన్ని పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం దేశం పేరును ఉపయోగించుకోవడాన్ని పిటిషనర్ గిరీష్ భరధ్వాజ్ ఇటీవల హైకోర్టులో సవాలు చేశారు. 'ఇండియా' పేరును వాడుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని ఈసీని కోర్టు ఆదేశించింది. దీనిపీ విచారణ సందర్భంగా ఈసీ తమ స్పందన తెలియజేస్తూ, ఎన్నికలు నిర్వహించడం, రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేసుకునే అధికారం మాత్రమే ఈసీకి ఉందని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, భారత రాజ్యాంగం కింద రాజకీయ పొత్తులను నియంత్రించలేమని పేర్కొంది. వాటి పనితీరును నియంత్రించే చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదని పేర్కొంది. అయితే 'ఇండియా' పేరు చట్టబద్ధతపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని స్పష్టం చేసింది.