Change: ముగ్గురు మంత్రుల శాఖల మార్పు!
ABN , First Publish Date - 2023-05-04T08:03:11+05:30 IST
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలో మంత్రి వర్గంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి
- టీఆర్ బాలు తనయుడికి మంత్రి పదవి?
చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలో మంత్రి వర్గంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) భావిస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకనున్నారని, కొందరు మంత్రుల శాఖలను మార్పు చేయడం ఖాయమని సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డీఎంకే కోశాధికారి, ఎంపీ టీఆర్ బాలు(MP TR Balu) తనయుడు రాజాకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారని చెబుతున్నారు. రెండేళ్లపాటు పనిచేసిన మంత్రులందరి పనితీరుపై ముఖ్యమంత్రి స్టాలిన్ గత కొద్ది రోజులుగా ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో చర్చలు కూడా జరిపారు. ఆదిద్రావిడుల శాఖ మంత్రి కయల్‌విళి, పర్యాటక శాఖ మంత్రి రామచంద్రన్, డెయిరీ శాఖ మంత్రి నాజర్‌కు ఉద్వాసన పలకాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి స్థానంలో కొత్తగా ముగ్గురిని మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు చెబుతున్నారు. కొత్తగా శాసనసభకు ఎన్నికైనవారిలో ముగ్గురికి ఈ శాఖలు అప్పగించనున్నారు. మంత్రి కయల్‌విళికి బదులుగా మానామదురై ఎమ్మెల్యే తమిళరసి ఆదిద్రావిడుల శాఖను కేటాయిస్తారు.
గతంలో ఈమె ఆ శాఖ మంత్రిగా పనిచేశారు. ఒక వేళ తమిళరసికి మంత్రిపదవి దక్కకుంటే శంకరన్ కోవిల్ ఎమ్మెల్యే రాజా ఆ శాఖను కేటాయిస్తారని కూడా తెలుస్తోంది. డీఎంకే సీనియర్ నాయకుడు ఎంపీ టీఆర్‌బాలు కుమారుడు టీఆర్‌పీ రాజా మన్నార్‌గుడి నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయనకు ఈసారి మంత్రి పదవి దక్కడం ఖాయమని చెబుతున్నారు. ఇదే విధంగా చెన్నై థౌజెండ్‌లైట్స్ ఎమ్మెల్యే డాక్టర్ ఎళిలన్‌కు మంత్రి పదవి దక్కుతుందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఎళిలన్ తండ్రి నాగనాథన్ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి కుడిభుజంగా వ్యవహరించారు. ఈ కారణంగానే ఎళిలన్‌కు మంత్రిపదవిని ఇవ్వాలని స్టాలిన్ భావిస్తున్నారు. డెల్టా జిల్లాలకు చెందిన శాసనసభ్యులలో మరొకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎంపై ఆ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. ఆ మేరకు తిరువిడైమరుదూరు ఎమ్మెల్యే కొవి చెళియన్‌కు మంత్రిపదవి ఇస్తారని డీఎంకే(DMK) నేతలు తెలిపారు. కొవి చెళియన్ ప్రస్తుతం డీఎంకే విప్‌గా ఉన్నారు. ఇక ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, చేనేత శాఖ మంత్రి గాంధీ శాఖలను కూడా మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యాశాఖ మంత్రులు పొన్ముడి, అన్బిల్ మహేష్ పొయ్యామొళి శాఖలను కూడా మార్పు చేస్తారని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.