Publisher Arrest: మణిపూర్ హింసపై న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు.. పబ్లిషర్ అరెస్టు
ABN , First Publish Date - 2023-07-29T16:14:44+05:30 IST
మణిపూర్ హింసపై భారత ప్రధాన న్యాయమూర్తి , సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలకు గాను చెన్నైకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పబ్లిషర్ బద్రి శేషాద్రిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు.
చెన్నై: మణిపూర్ హింస (Manipur Violence)పై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలకు గాను చెన్నైకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పబ్లిషర్ బద్రి శేషాద్రి (Badri Seshari)ని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు.
యూట్యూబ్ ఛానెల్‌లో మణిపూర్ హింసపై చర్చ సందర్భంగా బద్రి శేషాద్రి చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది కవియారసు పెరంబలూర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 22 యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేషాద్రి చేసిన వ్యాఖ్యలు తనను కల్లోలపరిచాయని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153, 153 A(1) (a), 505 (1) (b) కింద కేసు నమోదు చేశారు. అనంతరం శనివారం ఉదయం బద్రి శేషాద్రిని అరెస్టు చేశారు.
కాగా, బద్రి శేషాద్రి అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఖండించారు. సామాన్య ప్రజానీకాన్ని తమ అభిప్రాయాలను చెప్పకుండా అధికార డీఎంకే ఇలాంటి అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. పాలక ప్రభుత్వ ప్రతీకార ఎజెండాను అమలు చేయడమే పోలీసుల బాధ్యతా అని ఆయన ప్రశ్నించారు.