Chennai: అన్నాడీఎంకే సంచలన నిర్ణయం.. బీజేపీకి బై బై !

ABN , First Publish Date - 2023-09-26T08:31:23+05:30 IST

ఆరేళ్ల స్నేహం, రెండు ఎన్నికల బంధాన్ని కాదనుకున్న అన్నాడీఎంకే(AIADMK).. తన మిత్రుడు బీజేపీ(BJP)కి బైబై చెప్పేసింది. నేషనల్‌ డెమొక్రటిక్‌

Chennai: అన్నాడీఎంకే సంచలన నిర్ణయం.. బీజేపీకి బై బై !

- జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

- రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల సంబరాలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల స్నేహం, రెండు ఎన్నికల బంధాన్ని కాదనుకున్న అన్నాడీఎంకే(AIADMK).. తన మిత్రుడు బీజేపీ(BJP)కి బైబై చెప్పేసింది. నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ కూటమి లో కొనసాగేది లేదని తేల్చిచెప్పింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ యేతర కూటమితో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. బీజేపీ అధిష్ఠానం నుంచి వస్తున్న రకరకాల ఒత్తిళ్లు, ఆ పార్టీ రాష్ట్ర నేతల నుంచి ఎదురవుతున్న ఛీత్కారాల నేపథ్యంలో తనదారి తాను చూసేసుకుంది. సోమవారం సాయంత్రం రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సుమారు రెండు గంటలపాటు సమావేశమైన ఆ పార్టీ జిల్లా కార్యదర్శులతో కూలంకషంగా చర్చించిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami).. కీలకమైన ‘కఠిన నిర్ణయం’ తీసేసుకున్నారు. ఆ మేరకు ఆయన చేసిన ప్రతిపాదనను జిల్లా కార్యదర్శుల సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై పార్టీ సీనియర్‌ నేత కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) మాటలు అన్నాడీఎంకే కోట్లాదిమంది కార్యకర్తలకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. అంతేగాక జిల్లా కార్యదర్శులు, వివిధ అనుబంధ సంస్థల నాయకులు కూడా ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఏడాదిగా పథకం ప్రకారం ఉద్దేశపూర్వకం గా జయలలిత, అన్నాదురై తదితర నేతలను బీజేసీ చీఫ్‌ అన్నామలై తీవ్రంగా విమర్శిస్తున్నారని, అంతేగాక మదురై(Madurai)లో జరిగిన అన్నాడీఎంకే మహానాడు గురించి కూడా హేళనగా మాట్లాడారన్నారు. ఆయన వ్యాఖ్యల్ని 2 కోట్ల మందికి పైగా కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని, వీటన్నింటినీ గ్రహించిన ఈపీఎస్‌ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారన్నారు. ఈపీఎస్‌ నేతృత్వంలో పార్లమెంటు ఎన్నికల కూటమి ఏర్పాటవుతుందని కేపీ మునుస్వామి ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు

బీజేపీ నుంచి వైదొలగుతున్నట్లు అన్నాడీఎంకే అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. తమ పార్టీకి పట్టిన పీడ వదిలిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశా రు. అన్నాడీఎంకే యువజన విభాగ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సునీల్‌ పార్టీ కార్యాలయం ముందు భారీగా మిఠాయిలు పంచిపెట్టారు. అన్నాడీఎంకే నేతలైతే బహిరంగంగానే అన్నామలైని దుమ్మెత్తిపోశారు. అయితే ఎక్కడా బీజేపీ అధిష్ఠానాన్ని గానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై గానీ ఒక్క విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం.

nani1.2.jpg

ఎందుకిలా?

జయ మరణానంతరం జరిగిన పరిణామాల్లో ఈపీఎస్‌ తన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు కేంద్రంలో అధికారం నెరపుతున్న బీజేపీతో బాగా దగ్గరయ్యారు. బీజేపీ పెద్దలకు ‘అన్ని విధాలా’ సహకరిస్తూ.. తనకు కావాల్సింది తను నెరవేర్చుకున్నారు. అన్నాడీఎంకేలో తీసుకునే నిర్ణయాలను సైతం బీజేపీ అధిష్ఠానం మనోగతం మేరకే ఈపీఎస్‌ నడచుకుంటారన్న ప్రచారం కూడా విస్త్రతంగా జరిగింది. అన్నాడీఎంకేలో నం బర్‌ వన్‌గా ఉన్న వీకే శశికళను, నంబర్‌ టూగా వున్న టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాల న్న వ్యూహం కూడా బీజేపీ పెద్దలదేనని అన్నాడీంకే వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వారు పార్టీలో ఉంటే తన ఆధిపత్యానికి అడ్డుగా ఉంటారన్న ఉద్దేశంతో ముందస్తు వ్యూహం మేరకు వారిని తొలగించుకున్న ఈపీఎస్‌.. బీజేపీ సూచనల మేరకు ఓపీఎ్‌సను చేరదీశారు. అనంతరం పార్టీపై పట్టు సాధించాక.. బీజేపీ నేతలకు నచ్చచెప్పి మరీ ఓపీఎ్‌సను అడ్డు తొలగించుకున్నారు. అంతేగాక పార్టీ పగ్గాల వ్యవహారానికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ముందున్న అవాంతరాలను సైతం అధిగమించారు. న్యాయస్థానాల్లోనూ చిక్కుల్లేకుండా పోవడంతో పార్టీలో తనదైన ముద్ర వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆదినుంచి బీజేపీ కి నమ్మినబంటుగా ఉన్న ఈపీఎ్‌సకు ఆ పార్టీ పెద్దలు సైతం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఏ సమావేశంలోనూ ఈపీఎ్‌సను బీజేపీ అధిష్ఠానం ముందు వరుసలో నిలబెట్టింది. రెండు పార్టీల నేతలు సైతం రాన్ను లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని ప్రకటిస్తూ వచ్చారు. కానీ నెల రోజుల్లోనే పరిస్థితులు మారిపోవడం పట్ల రాజకీయవర్గాలు సైతం సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాయి.

బీజేపీతో కలిసి సాగితే కష్టమే!

రాష్ట్రంలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు ద్రావిడ నేతల పట్ల బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా కిందిస్థాయి కార్యకర్తల్లో ఆగ్రహం రేపుతున్నాయి. ఒకవైపు అన్నాదురై, పెరియార్‌ వంటి నేతల పట్ల అన్నామలై చేసిన వ్యాఖ్యలు, ఉదయనిధి కొత్తగా తీసుకొచ్చిన ‘సనాతన ధర్మ నిర్మూలనా నినాదం’ వంటివి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి దీంతో బీజేపీతో కలిసి సాగితే కష్టమేనని అన్నాడీఎంకే నేతలు గట్టిగా యోచిస్తున్నారు. బీజేపీతో కలిసి ఉండడం వల్ల రాష్ట్రంలో గణనీయంగా వున్న ముస్లింలు, క్రైస్తవుల ఓటర్లు తమకు దూరమయ్యారని, అదే తమను తీవ్రంగా నష్టపరిచిందని ఈపీఎస్‌ భావిస్తున్నారు. అదే ఇప్పుడు బీజేపీని వదుల్చుకుంటే తమకు ఓటు బ్యాంకు పెరుగుతుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే బీజేపీ పెద్దలకు నచ్చచెప్పి ‘స్నేహపూర్వక విడాకులు’ తీసుకున్నట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేసి నష్టపోవడం కన్నా, విడివడి లాభ పడడం మంచిదని, తద్వారా అవసరమైనప్పుడు రెండో వారికి అండగా వుండవచ్చని ఆయన నచ్చచెప్పినట్లు తెలిసింది. ఆ మేరకే అన్నాడీఎంకే వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-26T08:31:23+05:30 IST