Share News

Chattisgarh Congress Manifesto: రాష్ట్రంలో కులగణన, గ్యాస్‌ సిలెండర్‌పై రూ.500 సబ్సిడీ

ABN , First Publish Date - 2023-11-05T16:16:15+05:30 IST

కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన జరిపిస్తామని, గ్యాస్ సిలెండర్లపై రూ.500 సబ్సిడీ ఇస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆదివారంనాడు ఆయన విడుదల చేశారు.

Chattisgarh Congress Manifesto: రాష్ట్రంలో కులగణన, గ్యాస్‌ సిలెండర్‌పై రూ.500 సబ్సిడీ

రాయపూర్: కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన (Caste census) జరిపిస్తామని, గ్యాస్ సిలెండర్లపై రూ.500 సబ్సిడీ ఇస్తామని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto)ను ఆదివారంనాడు ఆయన విడుదల చేశారు. 'భరోసా క ఘోషనా పాత్ర 2023-2028' పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల నుంచి విడుదల చేశారు. రాయపూర్, జగదల్‌పూర్, బిలాస్‌పూర్, అంబికాపూర్, కవర్దాల్లో ఈ మేనిఫెస్టో విడుదల చేయగా, రాజ్‌నంద్‌గావ్‌లో సీఎం, రాయపూర్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కుమారి సెల్జా రిలీజ్ చేశారు.


వాగ్దానాలివే...

రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఎకరాకు 20 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. ధాన్యం పండిచేవారికి రాజీవ్ గాంధీ న్యాయ్ యోజన కింద ఇన్‌పుట్ సబ్సిడీ ప్రస్తుతం ఇస్తున్నామని, దీంతో సహా రైతులకు క్వింటాల్‌కూ రూ.3.200 చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. టెండు లీఫ్ కలెక్షన్‌‌కు ప్రస్తుతం ఇస్తున్న రూ.4000 నుంచి రూ.6,000 చేస్తామని, దీనికి అదనంగా టెండు లీఫ్ కలెక్టర్లకు వార్షికంగా రూ.4,000 బోనస్ ఇస్తామని ప్రకటించారు. తల్లులు, సోదరీమణుల కోసం 'మహతరి న్యాయ్ యోజన్' ప్రారంభిస్తామని, ఈ పథకం అన్ని ఆదాయ వర్గాల మహిళలకు వంటగ్యాస్‌పై రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు. సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతుందని చెప్పారు. కాగా, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత నవంబర్ 7న, రెండవ విడత నవంబర్ 17న జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-11-05T16:16:16+05:30 IST