Share News

Elections: సీఎం అభ్యర్థి తలరాతను మార్చిన ఒక్క ఓటు.. ఎన్నికల్లో అనూహ్య ఓటమి.. భార్య ఓటు వేసి ఉంటే..!

ABN , First Publish Date - 2023-11-30T17:06:56+05:30 IST

ఒక్క ఓటు కూడా అభ్యర్థుల తలరాతను మార్చగలదు. ఒకే ఒక్క ఓటు కూడా సీఎం అభ్యర్థులను సైతం ఓడించగలదు. గతంలో జరిగిన ఎన్నికల్లో అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. సీఎం అభ్యర్థి సైతం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఉదంతం 2008వ సంవత్సరంలో జరిగిన రాజస్థాన్‌ ఎన్నికల్లో చోటు చేసుకుంది.

Elections: సీఎం అభ్యర్థి తలరాతను మార్చిన ఒక్క ఓటు.. ఎన్నికల్లో అనూహ్య ఓటమి.. భార్య ఓటు వేసి ఉంటే..!

‘నేనొక్కడినే ఓటు వేయనంతమాత్రాన కొంపలేమీ మునిగిపోవు.. నా ఒక్క ఓటు ఈ రాష్ట్ర తలరాతను మార్చుతుందా ఏంటీ..? హాయిగా ఈ ఒక్కరోజు సెలవును ఎంజాయ్ చేద్దాం..’.. ఇదీ ఈ తరం యువతలో కనిపిస్తున్న విపరీత ధోరణి. వాస్తవానికి ఒక్క ఓటు కూడా అభ్యర్థుల తలరాతను మార్చగలదు. ఒకే ఒక్క ఓటు కూడా సీఎం అభ్యర్థులను సైతం ఓడించగలదు. గతంలో జరిగిన ఎన్నికల్లో అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. సీఎం అభ్యర్థి సైతం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఉదంతం 2008వ సంవత్సరంలో జరిగిన రాజస్థాన్‌ ఎన్నికల్లో చోటు చేసుకుంది.

2008వ సంవత్సరంలో రాజస్థాన్‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకుముందు ఉన్న బీజేపీ సర్కారుపై రాజస్థాన్ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా శ్రమించారు. ఆ ఎన్నికల్లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ కాంగ్రెస్ పార్టీకి 96 సీట్లు దక్కాయి. అంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 78 సీట్లను మాత్రమే దక్కించుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 14 చోట్ల గెలవగా.. బీఎస్పీ మరో ఆరు స్థానాల్లోనూ గెలిచారు. సీపీఐ మూడు స్థానాల్లోనూ, లోక్‌తాంత్రిక్ సమాజ్‌వాదీ పార్టీ ఒక స్థానంలోనూ.. జనతాదళ్(యూ) ఒక చోట, సమాజ్‌వాదీ పార్టీ మరో స్థానంలోనూ గెలిచాయి.. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించి అధికారంలోకి అయితే వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి అంటూ తెగ ప్రచారం జరిగిన సీపీ జోషి మాత్రం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు.

CP-Joshi.jpg

2008 నాటి ఎన్నికల సమయంలో రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీపీ జోషి ఉన్నారు. గెలిచే ఛాన్సులు అధికంగా ఉండటంతో కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే ఈసారి ఆయనే ముఖ్యమంత్రి అవుతారని కార్యకర్తలు కూడా ఆశించారు. ఆయన కూడా అదే ఆశతో తీవ్రంగా శ్రమించారు. ఆ ఎన్నిక్లలో ఆయన నాథ్‌ద్వారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనపై పోటీగా బీజేపీ నుంచి కల్యాణ్ సింగ్ చౌహాన్ బరిలోకి దిగారు. అయితే సీపీ జోషి అనూహ్యంగా ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. అదెలా సాధ్యమంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఎన్నిసార్లు లెక్కించినా అదే ఫలితం వచ్చింది.

వాస్తవానికి ఆ ఎన్నికల్లో సీపీ జోషి భార్య, కూతురు ఓటు వేయలేదు. గుడికి వెళ్లిన వాళ్లిద్దరూ.. పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు సమయం చాలదంటూ ఓటు వేయకుండానే తిరిగి ఇంటికెళ్లారు. భార్య కనుక ఆ ఎన్నికల్లో ఓటు వేసి ఉంటే.. ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చి ఉండేవి.. కూతురు కూడా ఓటు వేసి ఉంటే.. ఆ స్థానంలో సీపీ జోషియే గెలిచేవారు. కానీ అనూహ్యంగా ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. మరీ విచిత్రం ఏమిటంటే.. సీపీ జోషి కారు డ్రైవర్‌కు ఆయన నియోజకవర్గంలోనే వేరే ఊరిలో ఓటు హక్కు ఉంది. ‘నువ్వొక్కడివీ ఓటేయనంత మాత్రాన నేను ఓడిపోతానా..? నా పక్కనే ఉండు..’ అంటూ ఓటు వేయడానికి వెళ్లకుండా కారు డ్రైవర్‌ను సీపీ జోషియే ఆపారట కూడా. ఇలా సొంత వాళ్లు ఓట్లు వేయకపోవడం వల్లే సీపీ జోషి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సీఎం సీటు ఆయనకు అందకుండా పోయింది. 1998 లో కాంగ్రెస్ నుంచి రాజస్థాన్ సీఎంగా ఎన్నికయిన అశోక్ గెహ్లట్.. మరోసారి 2008 లోనూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీపీ జోషి ఎన్నికల్లో ఓడిపోవడంతో సీఎం పోస్టు విషయంలో అశోక్ గెహ్లట్‌కు పోటీ లేకుండా పోయింది. ఒక్క ఓటు విలువ అదన్నమాట. సొంత వాళ్ల ఓట్లే సీపీ జోషి తలరాతను మార్చేశాయి.

CP-Joshi-2.jpg

ఇక ఆ తర్వాత రోజుల్లో ఇదే విషయమై న్యాయపోరాటం కూడా జరిగింది. బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ భార్య రెండు చోట్ల ఓటు వేశారంటూ సీపీ జోషి హైకోర్టుకు వెళ్లారు. ఆ కేసు విషయంలో సుదీర్ఘ విచారణ జరిగింది. చివరకు 2017వ సంవత్సరంలో ఈ కేసులో హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం.. 2008వ సంవత్సరంలో నాథ్‌ద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు 2017వ సంవత్సరంలో హైకోర్టు ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఇలా పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది. అయితే 2008 ఎన్నికల్లో కల్యాణ్ సింగ్ గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు కాబట్టి.. ఎమ్మెల్యే హోదాలోనే ఆయన ఆ అయిదేళ్లు గడిపారు. కోర్టుల్లో తీర్పు వచ్చేసరికి ఆ పదవీకాలం కూడా పూర్తవడం గమనార్హం.

Updated Date - 2023-11-30T17:06:59+05:30 IST