NITI Aayog Boycott: సీఎంలకు ఆమాత్రం బాధ్యతలేదా?... రవిశంకర్ ప్రసాద్ ఫైర్..!
ABN , First Publish Date - 2023-05-27T16:54:26+05:30 IST
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన ముఖ్యమంత్రులపై బీజేపీ విరుచుకుపడింది. సీఎంల నిర్ణయం ప్రజావ్యతిరేకమని, బాధ్యతారాహిత్యమని తెలిపింది.
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ (NITI Aayog) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన (Boycott) ముఖ్యమంత్రులపై (Chief ministers) బీజేపీ (BJP) విరుచుకుపడింది. సీఎంలు తీసుకున్న నిర్ణయం ప్రజావ్యతిరేకమని, బాధ్యతారాహిత్యమని తెలిపింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో... ఆరోగ్యం, స్కిల్ డవలప్‌మెంట్, మహిళా సాధికారత, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు కీలకాంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం శనివారంనాడిక్కడ జరిగింది.
సమావేశానంతరం మీడియాతో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) మాట్లాడుతూ, దేశ సంపూర్ణాభివృద్ధికి ఉద్దేశించిన రోడ్ మ్యాప్‌ను నిర్ణయించేందుకు ఉద్దేశించిన కీలకమైన సమావేశం నీతి ఆయోగ్ సమావేశమని, 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 100కు పైగా అంశాలను చర్చించాలనే ప్రతిపాదన ఉందని, అయితే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరుకాలేదని చెప్పారు. ఇంత పెద్ద సంఖ్యలో సీఎంలు హాజరుకాకుంటే, తమ రాష్ట్ర ప్రజల వాణిని వారు ఎలా వినిపించగలుగుతారని ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమని, బాధ్యతారాహిత్యమైన, ప్రజావ్యతిరేక చర్య అని తప్పుపట్టారు. "నరేంద్ర మోదీని ఎంతకాలం ఇలా వ్యతిరేకిస్తూ వస్తారు?'' అని ఆయన నిలదీశారు. ప్రధాని మోదీతో విభేదించేందుకు మీకు మరిన్ని అవకాశాలు వస్తాయని, కానీ మీ రాష్ట్ర ప్రజలకు మీరు ఎందుకు హాని చేయాలనుకుంటున్నారని నీతి ఆయోగ్‌కు గైర్హాజరైన సీఎంలను ఉద్దేశించి ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు ఉన్నారు.