Bharat Jodo: అర్ధాంతరంగా ఆగిన రాహుల్ యాత్ర, భద్రతా లోపమే కారణమా?
ABN , First Publish Date - 2023-01-27T19:08:45+05:30 IST
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కశ్మీర్‌లో శుక్రవారంనాడు అనుకోని అవాంతరం..
జమ్మూ: రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra)కు కశ్మీర్‌లో శుక్రవారంనాడు అనుకోని అవాంతరం ఎదురైంది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది. రాహుల్‌కు కల్పిస్తున్న భద్రతను ఒక్కసారిగా ఉపసంహరించడంతో జనం ఆయనపైకి దూసుకువచ్చారని, దీంతో యాత్ర విరమించుకుని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని కాంగ్రెస్ ప్రకటించింది. పోలీసుల భద్రతా లోపం వల్లే యాత్ర ఆపేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, యాత్రలో ఎలాంటి భద్రతా లోపాలు లేవని, బనిహాల్ నుంచి ఇంతపెద్ద సంఖ్యలో జనం వస్తారని నిర్వాహకులు తమకు చెప్పలేదని జమ్మూకశ్మీర్ పోలీసులు వివరణ ఇచ్చారు. తమకు చెప్పకుండానే యాత్రను ఆపేశారని తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం, భారత్ జోడో యాత్రలో భాగంగా కశ్మీర్ లోయలో 20 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర జరపాల్సి ఉంది. బనిహాల్‌లో నడక మొదలుపెట్టి కిలోమీటర్ వరకూ యాత్ర సజావుగా జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా ఆయనతో కలిసి అడుగులు వేశారు. కిలోమీటర్ యాత్ర తర్వాత ఒక్కసారిగా రాహుల్‌కు భద్రత ఉపసంహరించారని, దాంతో యాత్ర అర్ధాంతరంగా నిలిపేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ప్రకటించింది.
నేనే ప్రత్యక్ష సాక్షిని: ఒమర్
కాగా, రాహుల్‌కు యాత్రలో కల్పిస్తున్న భద్రతను పోలీసులు ఒక్కసారిగా ఉపసంహరించుకున్నారని, దానికి తానే ప్రత్యక్ష సాక్షినని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ నడక ప్రారంభించిన నిమిషాల్లోనే ఆయన చుట్టూ జమ్మూకశ్మీర్ పోలీసులు కల్పించిన భద్రతా వలయం ఒక్కసారిగా కనిపించకుండా పోయిందని, జమ్మూ నుంచి కశ్మీర్‌లోకి అడుగుపెట్టి మరో 11 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా దురదష్టవశాత్తూ యాత్ర రద్దయిందని ఆయన తెలిపారు. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మరో ట్వీట్ చేస్తూ, బనిహాల్ వద్ద తీవ్రమైన భద్రతా లోపం తలెత్తిందని, అకస్మాత్తుగా సెక్యూరిటీ సిబ్బందిని ఉపసంహరించారని, ఇలా చేయమని ఎవరు ఆదేశించారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు, తన సెక్యూరిటీ సిబ్బందిని కాదని ముందుకు వెళ్లలేనని, ఆ కారణంగానే యాత్రను ఆర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందని రాహుల్ తెలిపారు. శ్రీనగర్‌లోని అవంతిపోర నుంచి శనివారంనాడు యాత్ర తిరిగి మొదలవుతుంది. జనవరి 30వ తేదీతో భారత్ జోడో యాత్ర ముగియనుంది.
జేకే పోలీసులు వివరణ
కాగా, బనిహాల్‌లో పెద్ద సంఖ్యలో జనం యాత్రలో పాల్గొంటారని నిర్వాహకులు తమకు తెలియజేయలేదని, పూర్తి స్థాయిలో తాము భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి భద్రతా వైఫల్యాలు లేవని, తమకు చెప్పకుండానే యాత్రను నిలిపివేశారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.