Bharat Jodo: రాహుల్ యాత్రకు ఒకరోజు రెస్ట్
ABN , First Publish Date - 2023-01-25T20:02:45+05:30 IST
రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో' యాత్ర 131వ రోజుకు చేరుకుంది. చివరి మజిలీగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఈ యాత్రకు వాతావరణ ప్రతికూలతలు..
జమ్మూ: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra) బుధవారంతో 131వ రోజుకు చేరుకుంది. చివరి మజిలీగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఈ యాత్రకు వాతావరణ ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో యాత్రకు 26వ తేదీ గురువారం ఒకరోజు విశ్రాంతి ప్రకటించారు. తిరిగి యాత్ర 27వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ పార్టీ కార్యదర్శి జైరామ్ రమేష్ ఓ ట్వీట్‌లో తెలిపారు.
కాగా, బుధవారం ఉదయం కూడా అనుకున్న సమయానికి ఒక గంట ఆలస్యంగా 9 గంటల ప్రాంతంలో రాంబన్ నుంచి బనిహాల్ వరకూ యాత్ర మొదలైంది. అయితే, మార్గంలో భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడుతుంటడంతో హైవేలపై రాకపోకలు రద్దు చేశారు. దీంతో మధ్నాహం నుంచి ముందుకు వెళ్లాల్సిన యాత్ర వాయిదా పడింది. ఉదయం వర్షం కురుస్తున్నప్పటికీ రైన్ కోట్ వేసుకుని రాహుల్ యాత్రను కొనసాగించడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు త్రివర్ణ పతాకాలతో ఆయనకు స్వాగతం పలికారు. జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వికార్ రసూల్ వని, ఇతర నేతలు రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగే భారీ ర్యాలీతో ముగియనుంది.