Karnataka Polls : అత్యధిక వయస్కుడిని ఎన్నికల బరిలో దించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ

ABN , First Publish Date - 2023-04-19T18:21:48+05:30 IST

సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాసన సభ ఎన్నికల బరిలోకి 91 ఏళ్ల వయసుగల షమనూర్ శివశంకరప్ప

Karnataka Polls : అత్యధిక వయస్కుడిని ఎన్నికల బరిలో దించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ
Shamanur Shivashankarappa, Congress

బెంగళూరు : సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాసన సభ ఎన్నికల బరిలోకి 91 ఏళ్ల వయసుగల షమనూర్ శివశంకరప్ప (Shamanur Shivashankarappa)ను దించింది. దక్షిణ దావణగెరె నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆయన గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి లోక్‌సభ సభ్యునిగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తనను తాను రేసుగుర్రం అని ప్రకటించుకున్నారు.

సెంట్రల్ కర్ణాటకలోని దావణగెరెకు పర్యాయపదంగా మారిన షమనూర్ శివశంకరప్ప మీడియాతో మాట్లాడుతూ, తనకు ప్రజల మద్దతు, భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయని, ఇంకేం కావాలని ప్రశ్నించారు. 91 సంవత్సరాల వయసులో తనకు కాంగ్రెస్ టిక్కెట్ రావడానికి కారణాన్ని వివరిస్తూ, కేవలం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు వస్తాయన్నారు. తాను రేసు గుర్రాన్ని అని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను అత్యధిక మెజారిటీతో గెలుస్తానని చెప్పారు.

షమనూర్ శివశంకరప్పపై బీజేపీ అభ్యర్థి బీజీ అజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. అజయ్ కుమార్ గతంలో దావణగెరె మేయర్‌గా పని చేశారు. షమనూర్ శివశంకరప్ప వీరశైవ మహాసభ అధ్యక్షుడు కూడా. ఆయన నడవాలంటే వ్యక్తుల సహాయం ఉండాలి, అయితే వినికిడి శక్తి బాగానే ఉంది. మాటలు కూడా స్పష్టంగానే మాట్లాడగలరు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ.312.75 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఆయనకు దావణగెరెలో వైద్య, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఎన్నికల బరిలో తనకు పోటీ ఎవరూ లేరని, తన గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ నేత జగదీశ్ షెట్టార్‌ను కాంగ్రెస్‌లోకి తేవాలని షమనూర్ శివశంకరప్పకు కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఆయన పావులు కదిపారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. షెట్టార్‌కు బీజేపీ టిక్కెట్ రాకపోవడంతో ఆయనను సునాయాసంగా కాంగ్రెస్‌లోకి తీసుకురాగలిగారు. మరోవైపు షెట్టార్‌కు షమనూర్ శివశంకరప్పకు బంధుత్వం కూడా ఉంది. షమనూర్ శివశంకరప్ప ముని మనుమరాలు ఆంచల్‌ను షెట్టార్ కుమారునికి ఇచ్చి వివాహం చేశారు. షమనూర్ శివశంకరప్ప కుమారుడు, మాజీ మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్‌ ఉత్తర దావణగెరె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Maoist links case : ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్

Karnataka Polls : స్వతంత్ర అభ్యర్థి డిపాజిట్ రూ.10 వేలు చెల్లించిన తీరు అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది!

Updated Date - 2023-04-19T18:22:09+05:30 IST