Congress : గవర్నర్ల నియామకం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం
ABN , First Publish Date - 2023-02-12T15:54:19+05:30 IST
రాష్ట్రాలకు గవర్నర్ల నియామక విధానంపై కాంగ్రెస్ (Congress) తీవ్రంగా విరుచుకుపడింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం
న్యూఢిల్లీ : రాష్ట్రాలకు గవర్నర్ల నియామక విధానంపై కాంగ్రెస్ (Congress) తీవ్రంగా విరుచుకుపడింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్తగా ఆరుగురిని గవర్నర్లుగా నియమిస్తూ, ఏడుగురు గవర్నర్లను బదిలీ చేయడంతో కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కోసం పని చేసేవారికి గవర్నర్ పదవిని ఇస్తున్నారని దుయ్యబట్టింది.
సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ (S Abdul Nazeer)ను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నియమించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, మోదీ కోసం పని చేసినవారు ఇప్పుడు గవర్నర్లు అయ్యారని వ్యాఖ్యానించారు. అదానీ కోసం మోదీ పని చేస్తారని, మోదీ కోసం పని చేసేవారు గవర్నర్లు అవుతారని అన్నారు. ఇక ప్రజల కోసం ఎవరు పని చేస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఇచ్చిన ట్వీట్‌లో గతంలో బీజేపీ (BJP) సీనియర్ నేత అరుణ్ జైట్లీ (Arun Jaitley) చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘రిటైర్‌మెంట్ తర్వాత వచ్చే పదవుల ద్వారా రిటైర్‌మెంట్‌కు ముందు ఇచ్చే తీర్పులు ప్రభావితమవుతాయి’ అని జైట్లీ 2012లో ఇచ్చిన ఆ ట్వీట్‌లోని వీడియోలో పేర్కొన్నారు. ‘‘గడచిన మూడు నాలుగేళ్ళలో దీనికి కచ్చితమైన రుజువు ఉంది’’ అని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ 2023 జనవరి 4న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి రిటైర్ అయ్యారు. అయోధ్య రామజన్మభూమి కేసులో తీర్పు చెప్పిన ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. ఈ ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి ఆయన. 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు. ఈ ప్రక్రియ సరైనదేనని ఈ ధర్మాసనం తీర్పు చెప్పింది.
ఇదిలావుండగా, బీజేపీ నేత బీఎల్ సంతోష్ కాంగ్రెస్, వామపక్షాల సంఘీభావంపై విరుచుకుపడ్డారు. ‘‘నేను చేసినట్లు కాదు, నేను చెప్పినట్లు చెయ్యి’’ అనే బ్రిగేడ్ రంగంలోకి దిగిందని మండిపడ్డారు. కాంగ్రెస్-వామపక్షాల ఎకోసిస్టమ్‌కు గల అలవాటులో భాగంగానే, జస్టిస్ (రిటైర్డ్) నజీర్‌ను గవర్నర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ ఎకోసిస్టమ్ ప్రకారం ఆయన చేసిన అతి పెద్ద పాపం శ్రీరామ జన్మభూమి కేసులో తీర్పు ఇవ్వడమేనని అన్నారు.