Congress : రాజస్థాన్ ముఖ్యమంత్రి మార్పు?... కాంగ్రెస్ అగ్ర నేత సంకేతాలు!...
ABN , First Publish Date - 2023-01-13T19:44:31+05:30 IST
కాంగ్రెస్ (Congress) పాలిత రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి మార్పు తథ్యమని ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో ఆ పార్టీ అగ్ర
న్యూఢిల్లీ : కాంగ్రెస్ (Congress) పాలిత రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి మార్పు తథ్యమని ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో ఆ పార్టీ అగ్ర నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), ఎమ్మెల్యే సచిన్ పైలట్ (Sachin Pilot) తమ పార్టీకి గొప్ప సంపద వంటివారని తెలిపారు. అయితే కాంగ్రెస్ అగ్ర నేతలు తీసుకునే ఏ నిర్ణయమైనా ఓ వ్యక్తికి కాకుండా, పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు.
జైరామ్ రమేశ్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాజస్థాన్ (Rajasthan)లో నాయకత్వ మార్పు అంశం ఏదో ఓ విధంగా పార్టీకి మేలు చేసేది అవుతుందని, అంతేకానీ ఓ సభ్యునికి ప్రయోజనం కలిగించేది కాబోదని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), తమ పార్టీ రాజస్థాన్ ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ సింగ్ రణధవ (Sukhjinder Singh Randhawa) ఏ నిర్ణయం తీసుకున్నా, అది కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తుందని చెప్పారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ పార్టీకి గొప్ప ఆస్తి వంటివారని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు.
భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో తన అనుభవాలను వివరిస్తూ రాహుల్ గాంధీ రాసిన లేఖను జైరామ్ రమేశ్ విడుదల చేశారు. దీనిని ‘హాత్ సే హాత్ జోడో’ (చేయీ చేయీ కలుపుదాం) కార్యక్రమంలో ఇంటింటికీ పంచుతామని చెప్పారు. నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలను వివరించే కరపత్రాన్ని కూడా అందరికీ ఇస్తామని చెప్పారు.
రాజస్థాన్ బడ్జెట్‌ను జనవరి 23న శాసన సభలో ప్రవేశపెడతారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. సచిన్ పైలట్ జనవరి 16న కిసాన్ సమ్మేళనం కోసం సిద్ధమవుతున్నారు. ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర జనవరి 26 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేసి, నేతలు ఇంటింటికీ వెళ్ళి ప్రజలతో మాట్లాడతారు.