Congress : కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అరెస్ట్... సుప్రీంకోర్టులో విచారణ...

ABN , First Publish Date - 2023-02-23T16:37:58+05:30 IST

రాయ్‌పూర్ వెళ్తేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera)ను ఢిల్లీ విమానాశ్రయంలో అస్సాం పోలీసులు గురువారం

Congress : కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అరెస్ట్... సుప్రీంకోర్టులో విచారణ...
Pawan Khera

న్యూఢిల్లీ : రాయ్‌పూర్ వెళ్తేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera)ను ఢిల్లీ విమానాశ్రయంలో అస్సాం పోలీసులు గురువారం అడ్డుకున్నారు. ఆయనను అరెస్ట్ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. ఇదిలావుండగా, తనపై నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం మధ్యాహ్నం విచారణ జరిపేందుకు అంగీకరించింది. తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కూడా ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

పవన్ ఖేరా శుక్రవారం ముంబైలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరును, ఆయన తండ్రిని అవమానిస్తూ మాట్లాడారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

‘‘ప్రధాని నరసింహా రావు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)ని ఏర్పాటు చేయగలిగినపుడు, అటల్ బిహారీ వాజ్‌పాయి జేపీసీని ఏర్పాటు చేయగలిగినపుడు, నరేంద్ర గౌతమ్ దాస్, సారీ, దామోదర్‌దాస్ మోదీకి వచ్చిన సమస్య ఏమిటి’’ అని పవన్ ఖేరా అన్నారని ఆరోపిస్తున్నారు.

అదానీ గ్రూప్ స్టాక్ మేనిపులేషన్‌కు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించిన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని ఈ విలేకర్ల సమావేశంలో ఖేరా డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో అస్సాంలో పవన్ ఖేరాపై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత సుప్రియ సునాటే మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారని, ఆయనతోపాటు తమ పార్టీ నేత రణదీప్ సింగ్ సుర్జీవాలా కూడా ఉన్నారని తెలిపారు. పవన్ ఖేరాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, అనేక దురాగతాలు జరుగుతున్నా ఇదే అస్సాం పోలీసులు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఖేరాను అదుపులోకి తీసుకోవడానికి కారణమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది నియంతృత్వం కాదా? అని, ఖేరా చేసిన తప్పు ఏమిటని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నోరు జారి ఏదో మాట్లాడినందుకు అరెస్టు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అలా అయితే మొదట మోదీని అరెస్టు చేయాలన్నారు. నెహ్రూ ఇంటిపేరును ఎందుకు వాడటం లేదని మోదీ ప్రశ్నించారన్నారు. తనను అస్సాం పోలీసులు తీసుకెళ్తుండగా ఖేరా మాట్లాడుతూ, ఇది సుదీర్ఘ పోరాటమని, తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

రణదీప్ సుర్జీవాలా మాట్లాడుతూ, వారంట్ లేకుండా పవన్ ఖేరాను అస్సాం పోలీసులు అరెస్టు చేశారన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు తాము అరెస్టు చేస్తున్నామని చెప్పారన్నారు. హిమంత అంటే భగవంతుడా? అని ప్రశ్నించారు.

ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల పోలీసులు పవన్ ఖేరాను విమానం నుంచి దించినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ విమానాశ్రయంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అస్సాం పోలీసులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, హఫ్లాంగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పవన్ ఖేరాను అరెస్టు చేసినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Karnataka : ఐపీఎస్ అధికారి రూపకు ఐఏఎస్ అధికారి రోహిణి హెచ్చరిక... రూ.1 కోటి పరువు నష్టం దావా...

Turkey and Syria : భూకంప బాధిత టర్కీ, సిరియాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కష్టాలు

Updated Date - 2023-02-23T16:38:02+05:30 IST