Rahul Gandhi : యూరోప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ?
ABN , First Publish Date - 2023-09-06T09:54:11+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం యూరోపు దేశాల పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన న్యాయవాదులు, విద్యార్థులు, భారతీయ మూలాలుగల ప్రజలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం యూరోపు దేశాల పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన న్యాయవాదులు, విద్యార్థులు, భారతీయ మూలాలుగల ప్రజలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఓ వైపు జీ20 సదస్సు అంగరంగ వైభవంగా జరుగుతున్న సమయంలో ఆయన విదేశాలకు వెళ్లారు. తిరిగి ఆయన ఈ సదస్సు ముగిసిన మర్నాడు స్వదేశానికి వస్తారు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను వెల్లడించింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, రాహుల్ గురువారం బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ న్యాయవాదులతో సమావేశమవుతారు. అదేవిధంగా ది హేగ్‌లో కూడా ఆయన న్యాయవాదులతో సమావేశమవుతారు. ఆయన శుక్రవారం పారిస్ నగరంలో ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారు.
ఆయన ఈ నెల 9న పారిస్‌లో ఫ్రాన్స్ లేబర్ యూనియన్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఆయన నార్వేకు వెళ్తారు. ఈ నెల 10న ఓస్లో నగరంలో భారతీయ మూలాలుగలవారితో సమావేశమవుతారు. ఈ నెల 11 తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది.
జీ20 సదస్సు న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరుగుతుంది. దాదాపు 30 దేశాలకు చెందిన అగ్ర నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సుకు భారత దేశం అధ్యక్షత వహిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Union Minister: కేంద్రమంత్రిపై పరువునష్టం దావా రద్దుకు హైకోర్టు నిరాకరణ
Minister Udayanidhi: తేల్చిచెప్పిన మంత్రి ఉదయనిధి.. భయపడను.. క్షమాపణలు చెప్పను