Siddaramaiah: ఎన్నికల వేళ సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-04-19T16:03:58+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Congress leader Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవే తనకు ఆఖరు ఎన్నికలని, ఈ ఎన్నికల తర్వాత తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. ఆయన ఈరోజు వరుణ నియోజకవర్గంలో (Varuna Assembly constituency) నామినేషన్ వేశారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి సిద్ధూ తనయుడు యతీంద్ర (Yathindra) గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. సిద్ధూ మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అని కులాల ఆధారంగా ఓట్లు అడగదని సిద్ధరామయ్య చెప్పారు. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి ఓట్లను ఆశిస్తామన్నారు.
కర్ణాటకలో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ రెండోసారి వరుసగా గెలవలేదు. దీంతో తమకే అవకాశమని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఒపీనియన్ పోల్స్‌లో కూడా ఇదే వెల్లడైంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.
మరోవైపు అభివృద్ధి అజెండాను వివరిస్తూ, డబుల్ ఇంజిన్ సర్కారు ప్రాధాన్యతను ఓటర్లకు తెలియజెబుతూ బీజేపీ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది. 224 స్థానాలకుగాను బీజేపీ ఇంతవరకు 222 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 74 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు. వరుణలో సిద్ధరామయ్యపై మంత్రి వి.సోమన్న తలపడనున్నారు. అలాగే కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మరో మంత్రి ఆర్.అశోక బరిలోకి దిగనున్నారు. ఇక సీఎం బొమ్మై తన సొంత నియోజకవర్గం శిగ్గావ్‌లో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్‌మగళూర్‌లో, రాష్ట్ర మంత్రి బి.శ్రీరాములు బళ్లారి రూరల్‌లో, గాలి జనార్దనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి బళ్లారి సిటీలో బరిలోకి దిగనున్నారు. హిజాబ్ వివాదం తలెత్తిన ఉడుపిలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘుపతి భట్ స్థానంలో యశ్‌పాల్ సువర్ణకు అవకాశమిచ్చారు.
జేడీఎస్ మొత్తం 150 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించింది. ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నా కింగ్ మేకర్స్ తామే అని జేడీఎస్ నాయకత్వం ధీమాగా ఉంది.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.