Siddaramaiah vs DK Shivakumar: అధిష్ఠానం నిర్ణయంలో జాప్యం? సీఎం ప్రకటన బెంగళూరులోనే...!
ABN , First Publish Date - 2023-05-16T20:37:15+05:30 IST
న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే దానిపై హస్తినలో ఎడతెరిపి లేకుండా పార్టీ అధిష్ఠానం చర్చలు సాగిస్తోంది. మంగళవారం రాత్రి వరకూ ఖర్గే ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో బుధవారం వరకూ సీఎంపై ప్రకటనలో జాప్యం జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నారు. తుది నిర్ణయాన్ని బెంగళూరులోనే ప్రకటించనున్నారు.
న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం (Karnataka Cm Tussle) ఎవరనే దానిపై హస్తినలో ఎడతెరిపి లేకుండా పార్టీ అధిష్ఠానం చర్చలు సాగిస్తోంది. సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ (DK Shivakumar)లు ఎవరికి వారే సీఎం పదవిపై పట్టుదలగా ఉండటంతో మధ్యేమార్గం సహా అన్ని రకాల మార్గాల్లోనూ వారితో అధిష్ఠానం మంతనాలు సాగిస్తోంది. తుది నిర్ణయం ఖర్గేకు అప్పగిస్తూ కర్ణాటక సీఎల్‌పీ ఏకవాక్య తీర్మానం చేసినప్పటికీ ఖర్గే ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో బుధవారం వరకూ సీఎంపై ప్రకటనలో జాప్యం జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నారు. తుది నిర్ణయానికి వచ్చేముందు సోనియాగాంధీ, రాహుల్‌ను మరోసారి ఖర్గే కలుసుకుంటారని, అనంతరం బెంగళూరులోనే సీఎం పేరు ప్రకటిస్తారని అంటున్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కలుసుకోవడంతో చర్చలు ఊపందుకున్నాయి. రెండురోజులుగా సిద్ధరామయ్య ఢిల్లీలోనే మకాం చేయగా, డీకే శివకుమార్ ఈరోజు ఉదయం ఒంటరిగానే ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలాను కలుసుకున్నారు. అనంతరం ఖర్గేతో భేటీ అయ్యారు. ఆ వెనువెంటనే సిద్ధరామయ్య సైతం ఖర్గేను కలిశారు. సంప్రదింపులు దాదాపు ముగిసినట్టేనని, రాహుల్, సోనియాగాంధీలను ఖర్గే మరోసారి కలుసుకుని తుది నిర్ణయానికి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారంనాటికి ఒక నిర్ణయానికి రావడం, వెంటనే ఆ నిర్ణయాన్ని బెంగళూరులో ఆయన ప్రకటించడం జరుగుతుందని అంటున్నారు.