Odisha train accident : మూడు రైళ్ల ప్రమాదానికి కారణం అదే : అధికారులు

ABN , First Publish Date - 2023-06-03T13:27:40+05:30 IST

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని రైల్వే అధికారులు చెప్తున్నారు.

Odisha train accident : మూడు రైళ్ల ప్రమాదానికి కారణం అదే : అధికారులు

బాలాసోర్ : ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో స్పష్టంగా నిర్ణయించాలంటే క్షుణ్ణంగా దర్యాప్తు చేయవలసి ఉంటుందని చెప్తున్నారు. ప్రాథమిక స్థాయిలో చూసినపుడు, మెయిన్‌లైన్‌లో ప్రయాణించవలసిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి వెళ్లి, అక్కడ ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగిందని అంటున్నారు. సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్‌లోని వీడియోను పరిశీలించినపుడు ఈ విషయం తెలుస్తోందని చెప్తున్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఖరగ్‌పూర్ రైల్వే డివిజన్ సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్‌లో ఓ వీడియోని పరిశీలించినపుడు, చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు బహానగర్ బజార్ స్టేషన్ దాటిన తర్వాత మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి, పట్టాలు తప్పి, మెయిన్ లైన్‌పై పడింది. అదే సమయంలో హౌరా వెళ్తున్న యశ్వంత్ నగర్ ఎక్స్‌ప్రెస్ అదే మార్గంలో ఎదురుగా వస్తోంది. ఆ యశ్వంత్ నగర్ ఎక్స్‌ప్రెస్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనే అంశాలు క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత వెల్లడవుతాయని రైల్వే అధికారి ఒకరు చెప్పారని జాతీయ మీడియా తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 127 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని తెలిపింది. ప్రాథమికంగా చూసినపుడు ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని తెలుస్తోందని ఆ అధికారి చెప్పినట్లు తెలిపింది.

మోదీ పరామర్శ

రైలు ప్రమాదంపై సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆయన శనివారం ఈ ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నారు. మొదట ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఆ తర్వాత కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తారు.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accidnt : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...

Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు..

Updated Date - 2023-06-03T13:27:40+05:30 IST