Cyclone Biparjoy : బిపర్‌జోయ్ తుపాను ప్రభావం.. ద్వారకలోని శ్రీ భడకేశ్వర్ మహాదేవ్ దేవాలయం వద్ద సముద్రం అల్లకల్లోలం..
ABN , First Publish Date - 2023-06-15T09:59:05+05:30 IST
బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం గుజరాత్‌లోని కచ్ జిల్లా, జఖావూ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కచ్ జిల్లాతోపాటు దాని పరిసరాల్లో ఉన్న జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు దాదాపు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు.
న్యూఢిల్లీ : బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం గుజరాత్‌లోని కచ్ జిల్లా, జఖావూ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కచ్ జిల్లాతోపాటు దాని పరిసరాల్లో ఉన్న జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు దాదాపు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచవచ్చు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. రోడ్లు, పంటలు, రైల్వేలు, విద్యుత్తు, కమ్యూనికేషన్లకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
బిపర్‌జోయ్ తుపాను ఈశాన్యంవైపు కదిలి, సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటే అవకాశం ఉందని గురువారం తెల్లవారుజామున 2.15 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో ఐఎండీ తెలిపింది. పాకిస్థాన్‌లోని కరాచీ, గుజరాత్‌లోని మాండ్విల మధ్య గురువారం సాయంత్రం తీరాన్ని దాటవచ్చునని తెలిపింది. తుపాను బాధితులకు అన్ని విధాలుగా సహాయపడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
సముద్రం అల్లకల్లోలం
గుజరాత్‌లోని దేవభూమి ద్వారకలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. శ్రీ భడకేశ్వర్ మహదేవ్ దేవాలయం సమీపంలో సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరాల వెంబడి సముద్ర పరిస్థితి గురువారం రాత్రి వరకు తీవ్రంగా ఉండవచ్చునని, ఆ తర్వాత పరిస్థితి మెరుగవుతుందని ఐఎండీ తెలిపింది. కచ్, దేవ భూమి ద్వారక, పోర్బందర్, జామ్ నగర్, మోర్బి జిల్లాల్లో తుపాను తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో 3 నుంచి 6 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడతాయని తెలిపింది.
కచ్, దేవభూమి ద్వారక, జామ్ నగర్‌లలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పోర్బందర్, రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చునని తెలిపింది.
రైల్వే శాఖ ముందు జాగ్రత్త చర్యలు
తుపాను నేపథ్యంలో పశ్చిమ రైల్వే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్ని రైళ్ల సేవలను కుదించారు. మొత్తం మీద 76 రైళ్ల సేవలను రద్దు చేయగా, 36 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు, 31 రైళ్లు బయల్దేరే స్టేషన్లలో మార్పులు చేశారు.
సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
గుజరాత్ రిలీఫ్ కమిషనర్ ఆలోక్ పాండే తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఉదయం తీర ప్రాంతాల నుంచి దాదాపు 74 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో తాత్కాలిక బసలను ఏర్పాటు చేశారు. కచ్ జిల్లాలో 34,300 మందిని, మోర్బిలో 6,089 మందిని, రాజ్‌కోట్‌లో 5,035 మందిని, దేవభూమి ద్వారకలో 5,035 మందిని జునాగఢ్‌లో 4,604 మందిని, పోర్బందర్‌లో 3,469 మందిని, గిర్ సోమనాథ్ జిల్లాలో 1,605 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
5000 ఏళ్లనాటి శివలింగం
శ్రీ భడకేశ్వర్ మహదేవ్ దేవాలయంలో 5,000 ఏళ్లనాటి శివలింగం ఉంది. ఈ శివలింగాన్ని 5,000 ఏళ్ల క్రితం అరేబియా సముద్రంలో గుర్తించారు. ప్రతి సంవత్సరం జూన్/జూలై నెలల్లో సముద్రం తనంతట తాను ఈ శివలింగానికి అభిషేకం చేస్తుంది. కొంత కాలం ఈ దేవాలయం సముద్రంలోనే ఉండిపోతుంది. మహాశివరాత్రి పర్వదినంనాడు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయం చుట్టూ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో మహాశివుడిని భక్తులు అన్ని వేళలా దర్శించుకోవచ్చు, అయితే అభిషేకం చేయాలంటే రోజూ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Annamalai: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. అనారోగ్యం కాదు.. అంతా నాటకమే!
Kolkata Airport : కోల్‌కతా విమానాశ్రయంలో స్వల్ప అగ్ని ప్రమాదం