Surgical Strike : భారత్ మళ్లీ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రేక్ చేసిందా?

ABN , First Publish Date - 2023-08-22T10:02:59+05:30 IST

భారత సైన్యం మరోసారి పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. అయితే నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం విఫలం చేసినట్లు తెలిపింది. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని వివరించింది.

Surgical Strike : భారత్ మళ్లీ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రేక్ చేసిందా?

న్యూఢిల్లీ : భారత సైన్యం మరోసారి పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. అయితే నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం విఫలం చేసినట్లు తెలిపింది. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని వివరించింది.

భారత దేశ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, బాలాకోట్ సెక్టర్, హమీర్‌పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం వాతావరణం దట్టమైన పొగమంచుతో కూడి ఉండటాన్ని ఇద్దరు ఉగ్రవాదులు అనుకూలంగా భావించారని, భారత దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారని, వీరిని మన సైన్యం గుర్తించిందని తెలిపింది.

ఇదిలావుండగా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో మరోసారి భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని మంగళవారం ఉదయం ఓ వార్తా పత్రిక తెలిపింది. భారత సైన్యం శనివారం రాత్రి ఎల్ఓసీ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీరులోకి 2.5 కిలోమీటర్లు వెళ్లి, పాకిస్థానీ ఉగ్రవాదులకు చెందిన నాలుగు లాంచింగ్ పాడ్‌లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపింది. భారత సైనికులంతా సురక్షితంగా తిరిగి వచ్చారని తెలిపింది. ఈ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వివరణ ఇచ్చింది.


వివిధ నిఘా సంస్థలు, జమ్మూ-కశ్మీరు పోలీసులు అందజేసిన సమాచారం ప్రకారం బాలాకోట్ సెక్టర్ నుంచి భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు కాచుకుని కూర్చున్నట్లు తెలిసిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా నిఘా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపింది. ఉగ్రవాదులు భారత సైనికుల సమీపానికి వచ్చిన వెంటనే, వారిని హెచ్చరించి, కాల్పులు జరిపారని, ఆ ఉగ్రవాదులు వాతావరణ పరిస్థితులను ఆసరాగా చేసుకుని పారిపోయారని వివరించింది. ఈ ప్రాంతంలో ఓ ఏకే-47 రైఫిల్, రెండు మ్యాగజైన్స్, 30 తూటాలు, రెండు గ్రెనేడ్లు, పాకిస్థానీ తయారీ మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు గాయపడినట్లు, వారి రక్తపు మరకలను గుర్తించినట్లు తెలిపింది.


ఇవి కూడా చదవండి :

4 రకాల రొమ్ముక్యాన్సర్‌ జన్యువుల గుర్తింపు

Ooty Hill Train: హరిత పథకంలో ‘కొండరైలు’

Updated Date - 2023-08-22T10:02:59+05:30 IST