2024 Loksabha Polls: ఆసక్తికర పరిణామం... ఉద్ధవ్‌తో కేజ్రీవాల్, మాన్ భేటీ

ABN , First Publish Date - 2023-02-24T22:30:00+05:30 IST

ఉద్ధవ్ థాకరేను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కలుసుకున్నారు.

2024 Loksabha Polls: ఆసక్తికర పరిణామం... ఉద్ధవ్‌తో కేజ్రీవాల్, మాన్ భేటీ
Arvind Kejriwal, Uddhav Thackeray

ముంబై: శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరే ( Uddhav Thackeray)ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కలుసుకున్నారు. ముంబైలో తన నివాసానికి వచ్చిన వీరిని ఉద్ధవ్ థాకరే, ఆయన తనయుడు ఆదిత్య థాకరే పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు. శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలంతా చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారధ్యంలోని భారతీయజనతాపార్టీని కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే విపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని నేతలు నిర్ణయించారు. మూడేళ్లుగా ఉద్ధవ్‌ను కలవాలనుకుంటున్నా కోవిడ్ తదితర కారణాల వల్ల కలవలేకపోయానని కేజ్రీవాల్ చెప్పారు. అదానీ హిండెన్‌బర్గ్ నివేదిక అనంతర పరిణామాలతో లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా నష్టాలపాలైందని కేజ్రీవాల్ ఆరోపించారు. శివసేన పార్టీ పేరును, గుర్తును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే వర్గం లాక్కుందని నేతలు అభిప్రాయపడ్డారు.

కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్ధవ్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్ధవ్ ఇటీవలి వరకూ ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ సర్కారును నడిపారు. తర్వాత శిండే మెజార్టీ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి పోటీ చేసి అధికారం చేపట్టడానికి కావాల్సినన్ని సీట్లు సంపాదించాయి. అయితే సీఎం పదవిపై వివాదం ఏర్పడి ఉద్ధవ్ ఎన్సీపీ-కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. కాంగ్రెస్‌తో సంకీర్ణ సర్కారు నడిపిన ఉద్ధవ్‌తో ఆప్ అధినేత కలవడం ఆసక్తికర పరిణామం మారింది. ఎన్నికల నాటికి కొత్త కూటమి ఏర్పాటుకు వీరి ప్రస్తుత సమావేశం నాంది పలకవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కేజ్రీవాల్ ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి(BRS) అధినేత కేసీఆర్‌(KCR)తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు కేజ్రీవాల్-థాకరే సమావేశం దోహదపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated Date - 2023-02-24T22:30:05+05:30 IST