Delhi High Court: సంచలన తీర్పు.. పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించండి..!
ABN , First Publish Date - 2023-05-02T11:25:52+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తాజాగా ఓ సంచలన తీర్పును వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తాజాగా ఓ సంచలన తీర్పును వెల్లడించింది. తన కుమారుడి పాస్‌పోర్టు (Passport) విషయమై ఓ ఒంటరి తల్లి వేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. ఆమెకు అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. పుట్టక ముందే కుమారుడిని వదిలిపెట్టి వెళ్లిపోయిన తండ్రి పేరును పాస్‌పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమె మైనర్ కుమారుడి పాస్‌పోర్టులో వెంటనే తండ్రి పేరును తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్ట్ మాన్యువల్ 2020 దీనికి సంబంధించిన పలు షరతులను స్పష్టంగా పేర్కొన్నందున మైనర్ బాలుడి పాస్‌పోర్టులో అతడి తండ్రి పేరు ఉండాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ తీర్పు ఇచ్చారు.
తాను ఒంటరి తల్లి అయినందున తన కుమారుడి పాస్‌పోర్టు నుంచి అతడి తండ్రి పేరును తొలగించాలని (Fathers Name Removed From Minor Son Passport) ఓ మహిళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కొడుకు పుట్టక ముందే అతడి తండ్రి వదిలి వెళ్లిపోయాడని తన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. దాంతో తాను ఒంటరిగా తన కుమారుడిని పెంచానని, తన కొడుకు పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించి కొత్తది ఇవ్వాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌ను (Petition) సోమవారం పరిశీలించిన జస్టిస్ ప్రతిభా ఎం సింగ్.. "తండ్రి బిడ్డను పూర్తిగా వదిలిపెట్టిన కేసు ఇది. మైనర్ కుమారుడి పాస్‌పోర్టులో నుంచి తండ్రి పేరును తొలగించి కొత్తది జారీ చేయాలని పాస్‌పోర్టు అధికారులను ఆదేశిస్తున్నాం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి పేరును తొలగించడంతో పాటు ఇంటిపేరునూ సైతం మార్చుకునే వెసులుబాటు ఉంది" అంటూ తీర్పును వెల్లడించారు.