Delhi Liquor Scam : అరుణ్ పిళ్ళై బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ABN , First Publish Date - 2023-06-02T15:04:38+05:30 IST
ఢిల్లీ రాష్ట్ర మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో నిందితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లై
న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో నిందితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లై (Arun Ramachandra Pillai) బెయిలు దరఖాస్తుపై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఈ నెల 8న సాయంత్రం 4 గంటలకు తీర్పు చెబుతామని రౌస్ ఎవెన్యూ కోర్టు తెలిపింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా పిళ్లై వ్యవహరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) చేసిన వాదనను ఆయన తరపు న్యాయవాది తోసిపుచ్చారు. ఆయన తన సొంత సొమ్మును పెట్టుబడి పెట్టారని చెప్పారు.
అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఈడీ మార్చి 6న అరెస్ట్ చేసింది. ఆయన తన స్టేట్‌మెంట్‌ను మార్చి 9న ఉపసంహరించుకున్నారు. అరెస్ట్ చేస్తామని అధికారులు బెదిరించడంతో ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఉందని పిళ్లై చెప్పారని, ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే పిళ్లైని అరెస్టు చేశారన్నారు. 20 నెలల తర్వాత స్టేట్‌మెంట్లను ఉపసంహరించుకున్న సందర్భాలు గతంలో చాలా ఉన్నాయన్నారు. కేసు దర్యాప్తులో ఉందంటూ పిళ్లైకి బెయిలు మంజూరు చేయకుండా ఈడీ అడ్డుకుంటోందన్నారు. ఉపసంహరించుకున్న స్టేట్‌మెంట్ ఆధారంగా బెయిలును వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో పిళ్లై పాత్ర లేదని చెప్పారు. ఆయన తన సొంత సొమ్ముతోనే భూములనుకొన్నారని చెప్పారు. ముడుపుల చెల్లింపులో కూడా ఆయన పాత్ర లేదన్నారు.
పిళ్లై పిటిషన్‌లో, ఒబెరాయ్ హోటల్‌లో ప్రింటవుట్ తీసుకున్నందుకు మద్యం కుంభకోణంలో తన పాత్ర ఉందని ఈడీ ఆరోపిస్తోందని తెలిపారు. 2021 మార్చి 14 నుంచి 17 వరకు శరత్ చంద్రా రెడ్డి, బుచ్చిబాబు ఒబెరాయ్ హోటల్‌లో ఉన్నారని చెప్పారు. తాను మార్చి 16 వరకు మాత్రమే ఆ హోటల్‌లో ఉన్నానని చెప్పారు. ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ కార్యదర్శి మార్చి 18న మద్యం విధానం ముసాయిదాను అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు ఇచ్చారని తెలిపారు. తాను మార్చి 16నే హోటల్ నుంచి వెళ్లిపోయానని, తాను అక్కడ ప్రింటవుట్ ఎలా తీయగలనని ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో తాను భాగస్వామినని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. డ్రాఫ్ట్ పాలసీని బుచ్చిబాబు నుంచి మాత్రమే స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. తనపై ఈడీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు విజయ్ నాయర్ ఫోన్లో కూడా ఈ పాలసీ డ్రాఫ్ట్ కాపీ లేదన్నారు. బుచ్చిబాబు ఫోన్లో మాత్రమే ముసాయిదా నకలు ఉందన్నారు. లిక్కర్ వ్యాపారంలో తాను తన సొంత సొమ్మునే పెట్టుబడి పెట్టానని చెప్పారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఇతరుల పెట్టుబడి లేదని చెప్పారు.
పిళ్లైని ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సౌత్ గ్రూప్ పేరుతో కొందరు ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారని, వీరు ఢిల్లీలోని అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీలో లిక్కర్ లైసెన్సులను పొందడం కోసం ఈ ముడుపులను చెల్లించినట్లు చెప్తోంది. ఇండోస్పిరిట్స్‌లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉన్నట్లు ఆరోపిస్తోంది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. ఆయన కూడా ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : ముస్లిం లీగ్ పూర్తి సెక్యులర్ పార్టీ : రాహుల్ గాంధీ
Congress : ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి.. 2024లో అనూహ్య ఫలితాలు.. : రాహుల్ గాంధీ