Devendra Fadnavis: అజిత్ పవార్‌తో చేతుల కలపడానికి కారణం చెప్పిన ఫడ్నవిస్
ABN , First Publish Date - 2023-10-04T15:49:03+05:30 IST
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గంతో బీజేపీ చేతులు కలపడానికి కారణం ఏమిటో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అజిత్ పవార్ వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేయాలని కోరుకోవడంతో ఆ వర్గాన్ని కలుపుకొని వెళ్లామని చెప్పారు.
ముంబై: మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ (Ajit Pawar) వర్గంతో బీజేపీ(BJP) చేతులు కలపడానికి కారణం ఏమిటో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అజిత్ పవార్ వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేయాలని కోరుకోవడంతో ఆ వర్గాన్ని కలుపుకొని వెళ్లామని, ఏక్‌నాథ్ షిండే వర్గం చేరిక విషయంలోనూ జరిగిందిదేనని చెప్పారు.
''ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఇవాళ విపక్ష పార్టీలు చేతులు కలిపాయి. అదే విధంగా మాతో కలిసి మాకు మరింత బలం చేకూర్చేందుకు ముందుకు వచ్చే ఏ పార్టీనైనా కలుపుకొని వెళ్లే విషయంలో మాకు ఎలాంటి సమస్య లేదు'' అని ఫడ్నవిస్ చెప్పారు. ఎన్‌సీపీలో గత జూలైలో చీలిక తీసుకువచ్చిన అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వంలో చేరారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
బీజేపీకి ఎన్‌సీపీ రాజకీయ భాగస్వామి...
ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గాన్ని రాజకీయ భాగస్వామిగా ఫడ్నవిస్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శివసేన (షిండే వర్గం) తమ సహజ భాగస్వామి అని, ఎన్‌సీపీ రాజకీయ భాగస్వామి అని చెప్పారు. ఇంకా సహజ భాగస్వామి కాలేదని చెప్పారు. రాబోయే ఐదు, పదేళ్ల వారు (అజిత్ వర్గం) తమతో ఉంటే వారు కూడా సహజ భాగస్వాములవుతారని విశ్లేషించారు. అయితే, ఆ వర్గం తమతోనే ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపారు. 27 భాగస్వామ్య పార్టీలు 'ఇండియా' కూటమిగా ఏర్పడటంపై అడిగినప్పుడు, గతంలో వారంతా ఒకరితో ఒకరు కలబడిన వాళ్లేనని, పరస్పర అవసరాల రీత్యానే వారు ఇప్పుడు చేతులు కలిపారని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.