Supriya Sule: టాటా, అమితాబ్ బచ్చన్‌ను చూడు?... అజిత్‌కు పవార్ కుమార్తె కౌంటర్
ABN , First Publish Date - 2023-07-05T19:23:54+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వయసును ఎత్తిచూపుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ పవార్ కుమార్తె, ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే భగ్గుమన్నారు. రతన్ టాటా, అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా పనిచేయడం లేదా అని ప్రశ్నించారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (NCP) వయసును ఎత్తిచూపుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని అజిత్ పవార్ (Ajit pawar) చేసిన వ్యాఖ్యలపై సీనియర్ పవార్ కుమార్తె, ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే (Supriya sule) భగ్గుమన్నారు. ''మమ్మల్ని అగౌరవపరుచు. మా నాన్నను కాదు'' అని అజిత్ పవార్ పేరును నేరుగా ప్రస్తావించకుండా మండిపడ్డారు. కొంతమంది వ్యక్తులు సీనియర్లను పని చేయడం మానేయమంటున్నారని, ఎందుకు పనిచేయడం మానేయాలని ఆమె ప్రశ్నించారు. పనిచేయడానికి వయసు అడ్డుకాదని చెబుతూ, రతన్ టాటాకు 86 ఏళ్లని, సెరుమ్ ఇన్‌స్టిట్యూట్ సైరస్ పూనావాలా వయస్సు 84 ఏళ్లని, అమితాబ్ బచ్చన్‌కు 82 అని ఆమె గుర్తుచేశారు. వారెన్ బఫెట్, ఫరూక్ అబ్దుల్లా పేర్లను కూడా సుప్రియ ప్రస్తావించారు.
దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ బీజేపీ..
బీజేపీపై కూడా సుప్రియా సూలే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పోరాటం బీజేపీపైనేనని, దేశంలోనే అతిపెద్ద అవినీతి పార్టీ బీజేపీయేనని ఆమె ఆరోపించారు.
అజిత్ పవార్ ఏమన్నారు?
దీనికి ముందు, అజిత్ పవార్ ముంబైలో తనకు మద్దతుగా నిలిచిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో శరద్ పవార్‌పై ఘాటు విమర్శలకు దిగారు. ''మీరు (శరద్ పవార్) నన్ను అందరిముందు విలన్‌గా చూపించారు. ఇప్పటికీ మీరంటే నాకు గౌరవం ఉంది. మీరే చెప్పండి...ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకు పదవీ విరమణ చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా బీజేపీ నేతలు 75 ఏళ్లకు రిటైర్ అవుతున్నారు. ఎల్.కె.అడ్వాణి, మురళీ మనోహర్ జోషిలను ఉదాహరణగా తీసుకోండి. కొత్త జనరేషన్ ఎదిగేందుకు అవకాశం ఇవ్వండి. మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి. మీ వయస్సు 83. ఇప్పటికైనా ఆగరా? మీరు మాకు ఆశీస్సులు ఇస్తే, మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో ఉంటాలని మేము భగవంతుని ప్రార్థిస్తాం'' అని అజిత్ పవార్ అన్నారు.
కాగా, అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఇటు సుప్రియా సూలేతో పాటు పలువురు పార్టీ సీనియర్లు, ఎమ్మెల్సీలు సైతం మండిపడుతున్నారు. పవార్ సింహం అని, సింహానికి వయస్సుతో నిమిత్తం లేదని, పవార్ కారణంగానే తామంతా నాయకులుగా ఎదిగామని వ్యాఖ్యానిస్తున్నారు.