Karnataka : కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపై డీకే శివ కుమార్ సోదరుడి అసంతృప్తి

ABN , First Publish Date - 2023-05-18T11:23:23+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేసే కసరత్తును కాంగ్రెస్ ఎట్టకేలకు పూర్తి చేయగలిగింది. మొదటి రెండేళ్లు సిద్ధరామయ్యకు,

Karnataka : కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపై డీకే శివ కుమార్ సోదరుడి అసంతృప్తి
DK Shiv Kumar

న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేసే కసరత్తును కాంగ్రెస్ ఎట్టకేలకు పూర్తి చేయగలిగింది. మొదటి రెండేళ్లు సిద్ధరామయ్యకు, ఆ తర్వాత మూడేళ్లు డీకే శివ కుమార్‌కు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇరువురు నేతలు ఈ ఒప్పందానికి అంగీకరించారు. దీంతో వీరిరువురూ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్ దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటించవలసి ఉంది. గురువారం ఉదయం 11.30 గంటలకు కాంగ్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో డీకే శివ కుమార్ (DK Shivakumar) సోదరుడు డీకే సురేశ్ (DK Suresh) ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసినట్లు ధ్రువీకరించారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పట్ల తాను సంతోషంగా ఉన్నానని అనుకోవడం లేదన్నారు. ఇది సంతోషం కలిగించే వార్త అని తాను అనుకోవడం లేదన్నారు. ఓ సోదరునిగా తాను నిరాశకు గురయ్యానని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఈ నిర్ణయానికి అంగీకారం తెలపవలసి వచ్చిందని చెప్పారు. అధికార పంపిణీ సూత్రానికి సంబంధించిన వివరాలను ఇప్పుడే చెప్పలేనని తెలిపారు. ఏఐసీసీ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనివ్వండన్నారు. తాము దాని కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.

ఇదిలావుండగా, సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ గురువారం ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. అధికార పంపిణీ, మంత్రిత్వ శాఖలు వంటి అంశాలపై వీరు చర్చిస్తారని తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు కేపీసీసీ అధ్యక్ష పదవిలో శివ కుమార్ కొనసాగుతారని తెలుస్తోంది.

మాస్ లీడర్ సిద్ధూ

సిద్ధరామయ్య మాస్ లీడర్‌గా పేరు పొందారు. ఆయన కర్ణాటక ఆర్థిక మంత్రిగా 13 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. 2013-18 మధ్య కాలంలో ఐదేళ్లపాటు కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు.

కాంగ్రెస్ ఘన విజయం

మే 10న జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాల్లో విజయం సాధించాయి.

ఇవి కూడా చదవండి :

Karnataka : కర్ణాటక కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం సాయంత్రం 7 గంటలకు : డీకే

Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్యకే!

Updated Date - 2023-05-18T11:23:23+05:30 IST