Bengal Panchayat Violence: ఈ 'మృత్యు క్రీడ' మీకు సమ్మతమేనా?.. రాహుల్‌కు స్మృతి ఇరానీ సూటిప్రశ్న
ABN , First Publish Date - 2023-07-09T16:49:01+05:30 IST
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తీవ్రమైన హింసాకాండ చెలరేగడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఆ పార్టీతో చేతులు కలపాలనుకుంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇలాంటి హింసాకాండ సమ్మతమేనా? అని ప్రశ్నించారు.
భోపాల్: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో (West bengal Panchayat polls) తీవ్రమైన హింసాకాండ చెలరేగడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఆ పార్టీతో చేతులు కలపాలనుకుంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఇలాంటి హింసాకాండ సమ్మతమేనా? అని ప్రశ్నించారు.
పశ్చిమబెంగాల్‌లో శనివారంనాడు జరిగి మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసాకాడం, దహనకాండ వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్మృతి ఇరానీ మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఎంతగా ఖూనీ అయిందో ప్రజలంతా చూశారని, ప్రజాస్వామ్య హక్కుల కోసం జనం ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అదే తృణమూల్ కాంగ్రెస్‌తో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపాలనుకుంటోందని అన్నారు. "బెంగాల్‌లో భయోత్పాతం సృష్టించిన వారితో చేతులు కలపడం సరైనదేనని గాంధీ కుటుంబం అనుకుంటోందా? ఈ మృత్యు క్రీడను రాహుల్ గాంధీ సమర్ధిస్తున్నారా?'' అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు. కాగా, స్మృతి ఇరానీ ప్రశ్నకు రాహుల్ గాంధీ ఇంకా స్పందించాల్సి ఉంది.
మమత చేతులు రక్తసిక్తం: అధీర్ రంజన్
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింసాకాండపై పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి అధికార టీఎంసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ చేతులు రక్తసిక్తమయ్యయాని వ్యాఖ్యానించారు. "ఇదెలాంటి ప్రజాస్వామ్యం. మీ చేతులకు పూర్తిగా రక్తం అంటుకుంది'' అని మమతను ఉద్దేశించి అన్నారు. బాంబుదాడిలో మృతిచెందిన 62 ఏళ్ల ఓ వ్యక్తి కుటుంబాన్ని ముర్షీదాబాద్ ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం అధీర్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర బలగాలు ఏమయ్యాయంటూ నిలదీసిన టీఎంసీ
పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింసాకాండపై నిలదీస్తున్న ప్రతిపక్షాలపై టీఎంపీ విరుచుకుపడింది. హింసజరిగి, అనేక మంది ప్రాణాలు పోతున్న సమయంలో కేంద్ర బలగాలు ఎక్కుడున్నాయని నిలదీసింది. కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఈ హింస చెలరేగిందంటూ తప్పుపట్టింది.
రాష్ట్రపతి పాలనకు సువేందు డిమాండ్
పశ్చిమబెంగాల్ తగులబడిపోతోందని, 355 అధికరణతో కానీ, 356 అధికరణతో (రాష్ట్రపతి పాలన) కానీ కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే అధికార పార్టీకి చెందిన గూండాలు 20,000 బూత్‌లను తమ అధీనంలోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.