Sharad Pawar: కులంపై ఎలాంటి దాపరికం లేదు: పవార్
ABN , First Publish Date - 2023-11-14T18:41:29+05:30 IST
మరాఠా సీనియర్ నేత, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఓబీసీ వర్గానికి చెందినట్టు ఒక డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆయన మంగళవారంనాడు స్పందించారు. కులాన్ని దాచిపెట్టాల్సిన అవసరం తనకు లేదని, తాను ఎన్నడూ కుల రాజకీయాలకు పాల్పడలేదని సమాధానమిచ్చారు.
బారామతి: మరాఠా సీనియర్ నేత, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) ఓబీసీ వర్గానికి చెందినట్టు ఒక డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆయన మంగళవారంనాడు స్పందించారు. కులాన్ని దాచిపెట్టాల్సిన అవసరం తనకు లేదని, తాను ఎన్నడూ కుల రాజకీయాలకు పాల్పడలేదని సమాధానమిచ్చారు. ఇది నకిలీ డాక్యుమెంట్ అని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇప్పటికే ఖండించారు.
శరద్‌పవార్ మహారాష్ట్ర జనాభాలో 30 శాతానికి పైగా ఉన్న మరాఠా కమ్యూనిటీకి చెందిన నేత. ప్రపంచం మొత్తానికి తన కులం ఏమిటో తెలుసునని, తనకు ఓబీసీ కమ్యూనిటీ అంటే గౌరవం ఉందని, అలాగే పుట్టిన కులాన్ని దాచిపెట్టాలని తానెన్నడూ కోరుకోలేదని పవార్ తెలిపారు. కుల రాజకీయాలకు తాను ఎన్నడూ పాల్పడలేదన్నారు. కమ్యూనిటీ సమస్యల పరిష్కారాన్ని తాను చేయాల్సినదంతా చేస్తూనే ఉంటానని చెప్పారు.
మరాఠా రిజర్వేషన్లపై..
మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై అడిగినప్పుడు, రిజర్వేషన్లు కల్పించడమనేది రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందని పవార్ సమాధానమిచ్చారు. మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్లపై యువతరం సెంటిమెంట్లు బలంగా ఉన్నాయని, వాటిని నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకే వదిలి పెట్టాలన్నారు. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ డిమాండ్ ఉధృతం కావడంతో పాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు ఇటీవల చోటుచేసుకున్నాయి.