Share News

Money Laundering case: 'ఆప్' ఎమ్మెల్యేను అరెస్టు చేసిన ఈడీ

ABN , First Publish Date - 2023-11-06T19:08:44+05:30 IST

మనీ లాండరింగ్‌ కేసులో పంజాబ్‌లోని అమర్‌గఢ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్‌ మాజరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది. 60 ఏళ్ల గజ్జన్ మాజరాపై గత ఏడాది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.

Money Laundering case: 'ఆప్' ఎమ్మెల్యేను అరెస్టు చేసిన ఈడీ

ఛండీగఢ్: మనీ లాండరింగ్‌ కేసులో పంజాబ్‌లోని అమర్‌గఢ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్‌ మాజరా (Jaswant Singh Gajjanmajra)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారంనాడు అరెస్టు చేసింది. 60 ఏళ్ల గజ్జన్ మాజరాపై గత ఏడాది మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదైంది.


మనీలాండరింగ్ కేసులో గజ్జన్ మాజరాను ప్రశ్నించేందుకు గతంలో నాలుగు సార్లు సమన్లు పంపినప్పటికీ ఆయన గైర్హాజర్ అయ్యారని, దాంతో ఆయనను ఈడీ కస్టడీలోకి తీసుకుందని ఆ వర్గాల తెలిపాయి. మహాలి కోర్టులో ఆయనను హాజరుపరుస్తున్నారు. మలెర్‌కోట్ల జిల్లా అమర్‌గఢ్‌లో సోమవారం ఉదయం ఆప్ కార్యకర్తల సమావేశంలో గజ్జన్ మాజరా మాట్లాడుతుండగా జలంధర్ టీమ్ అక్కడకు చేరుకుని ఆయనను కస్టడీలోకి తీసుకుంది.


కాగా, 2022 సెప్టెంబర్‌లో ఈడీ బృందం గజ్జర్ మాజరా ఇంటిపైన, అమర్‌గఢ్‌లో ఆయన కుటుంబ సభ్యులు నడుపుతున్న పాఠశాల, పశువుల దాణా ఫ్యాక్టరీపైనా దాడులు జరిపింది. గత ఏడాది రూ.40.92 కోట్ల మేరకు బ్యాంకు మోసానికి (Bank Fraud) పాల్పడిన ఆరోపణలపై సీబీఐ ఆయన ఆస్తులపై దాడులు జరిపింది. ఈ సోదాల్లో రూ.16.57 లక్షల నగదు, 88 విదేశీ కరెన్సీ నోట్లు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ తెలిపింది. సీబీఐ దాడుల నేపథ్యంలో ఆయనపై పీఎంఎల్ఏ కేసును ఈడీ నమోదు చేసింది. బ్యాంకు మోసం కేసులో గజ్జన్ మాజరాతో సహా ఏడుగురు వ్యక్తులు, కంపెనీలపై ఆరోపణలు ఉన్నాయి.


ఈడీ చర్యపై అనుమానాలు: ఆప్

ఆప్ ఎమ్మెల్యే జస్వత్ సింగ్ గజ్జన్ మాజరా అరెస్టును ఆ పార్టీ నేత మల్విందర్ సింగ్ నిలదీశారు. ఇతి చాలా పాత కేసు అని, గజ్జన్ మాజరా ఆప్‌లో చేరడానికి ముందు వ్యవహరమని చెప్పారు. అయితే, ఈడీ ఆదరాబాదరాగా పబ్లిక్ మీటింగ్‌లో గజ్జన్ మాజరా మాట్లాడుతుండగా అరెస్టు చేయడం ఈడీ చర్యపై పలు అనుమానాలకు తావిస్తోంద్నారు.

Updated Date - 2023-11-06T19:08:46+05:30 IST