Shiv sena Advertisement: నష్టనివారణ కోసం షిండే శివసేన మరో యాడ్.. ఇందులో ఏముందంటే..?
ABN , First Publish Date - 2023-06-14T14:31:18+05:30 IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన మంగళవారంనాడు పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ పత్రికా ప్రకటన వివాదాస్పదం కావడంతో వెంటనే అప్రమత్తమైంది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. బుధవారం మరో అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. మొదటి యాడ్‌లో వచ్చిన విమర్శలను రెండో యాడ్‌లో సరిచేసుకుంది.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన (Eknath Shinde Shiv Sena) మంగళవారంనాడు పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ పత్రికా ప్రకటన (Advertisement) వివాదాస్పదం కావడంతో వెంటనే అప్రమత్తమైంది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. బుధవారంనాడు మరో అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. మొదటి యాడ్‌లో వచ్చిన విమర్శలను రెండో యాడ్‌లో సరిచేసుకుంది. ఆసక్తికరంగా, ఈసారి కూడా ఓ పొరపాటు దొర్లింది.
యాడ్ వివాదం...
''దేశానికి మోదీ, మహారాష్ట్రకు షిండే'' (Modi For india, Shinde For Maharashtra) అనే శీర్షికతో షిండే శివసేన మంగళవారం పలు పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చింది. ఇందులో బీజేపీ మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తావన కానీ, ఫోటో కానీ లేవు. పైగా, రాష్ట్రంలో నిర్వహించిన ఓ సర్వేను ఉటంకిస్తూ ఇచ్చిన ఈ ప్రకటనలో భావి సీఎంగా ఫడ్నవిస్ కంటే షిండేకే ఎక్కువ ఆదరణ ఉందని తెలిపింది. 26.1 శాతం ప్రజలు తదుపరి ముఖ్యమంత్రిగా షిండేను కోరుకోగా, 23.2 శాతం మంత్రి ఫడ్నవిస్‌ను కోరుకుంటున్నారని ఆ ప్రకటన పేర్కొంది. దీంతో ఈ యాడ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇది గతంలోని బాలాసాహెబ్ శివసేన కాదని, నరేంద్ర మోదీ-అమిత్‌షాల శివసేన అని ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన విమర్శించింది. బాలాసాహెబ్ ఫోటో ఏదని నిలదీసింది. షిండే తనను ప్రమోట్ చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ ఆచితూచి స్పందించింది. ఏ నాయకుడికి, ఏ పార్టీకి ఎంత జనాకర్షణ ఉందనేది ఎన్నికల ఫలితాలే చెబుతాయని, క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే షిండేకు పేరుందని, సీఎం అయ్యాకు కొంత ఆదరణ పెరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించింది.
ఇవాల్టి యాడ్‌లో ఏముంది?
కాగా, పరిస్థితిని నిశితంగా గమనించిన షిండే శివసేన..నష్ట నివారణ చర్యల్లో భాగంగా బుధవారంనాడు మరో యాడ్‌ను విడుదల చేసింది. ప్రజల మొదటి ప్రాధాన్యత శివసేన-బీజేపీ కూటమికే ఉందని యాడ్‌లో తెలిపింది. మొదటి యాడ్‌లో శివసేన పార్టీ గుర్తు మాత్రమే ఉండగా రెండో యాడవ్‌వో బీజేపీ కమలం గుర్తు, ఆ పక్కనే శివసేన పార్టీ గుర్తును ఏర్పాటు చేశారు. బాలాసాహెబ్ థాకరే ఫోటో కూడా ఇందులో చేర్చారు. ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవిస్ పక్కపక్కనే ఉన్న ఫోటో కూడా ఇవాల్టి యాడ్‌లో చోటుచేసుకుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సీఎం (షిండే) సారథ్యంలోని శివసేన ఈసారి కూడా ఒక చిన్న పొరపాటు చేసింది. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే చోట శివసేన మంత్రుల పేర్లు మాత్రమే ప్రస్తావించారు. బీజేపీ నేతల పేర్లేవీ లేవు.