Uddhav Thackeray: ఎన్నికల సంఘాన్ని రద్దు చేయండి
ABN , First Publish Date - 2023-02-20T19:36:00+05:30 IST
ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని..
ముంబై: ఎన్నికల సంఘం (EC)పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సారథ్యంలోని శివసేన వర్గాన్ని అసలైన శివసేన (Shiv sena)గా గుర్తించి, వారికి ఎన్నికల గుర్తు "విల్లు-బాణం'' కేటాయించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశామని, మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
''మా పార్టీ నుంచి అన్నీ ఎత్తుకెళ్లారు. పార్టీ పేరు, గుర్తు లాక్కొన్నారు. కానీ థాకరే పేరును మాత్రం ఎవరూ దోచుకోలేరు. ఈరోజు మాకు జరిగినట్టే రేపు వేరో పార్టీలకు కూడా జరగవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం కానీ, ఎన్నికలు కానీ ఉండవు'' అని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున పార్టీ పేరు, గుర్తు కేటాయింపులపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని గతంలోనే తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించామని, అయినా కూడా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని, ప్రజలే ఎన్నికల కమిషనర్లను ఎన్నుకోవాలని ఆయన అన్నారు.
దీనికి ముందు, ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ థాకరే వర్గం సోమవారంనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని అత్యవసర విచారణ జాబితాలో చేర్చాలని థాకరే తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, ఈ అభ్యర్థనను సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారం సరైన ప్రక్రియతో మంగళవారం న్యాయస్థానం ముందుకు రావాలని సూచించింది.