G20 Summit : సంక్షోభంలో చిక్కుకున్న దేశాలకు భారత్ అండ... జీ20 సదస్సులో సరికొత్త ప్రతిపాదన...

ABN , First Publish Date - 2023-02-15T16:13:36+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైనా తీవ్రంగా ఉంది. కొన్ని దేశాలు

G20 Summit : సంక్షోభంలో చిక్కుకున్న దేశాలకు భారత్ అండ... జీ20 సదస్సులో సరికొత్త ప్రతిపాదన...
G20 Summit

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైనా తీవ్రంగా ఉంది. కొన్ని దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతూ, ప్రజలకు నిత్యావసరాలను కూడా అందించలేకపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి ఆయా దేశాలను తప్పించాలనే లక్ష్యంతో భారత దేశం ఓ సరికొత్త ఆలోచనకు రూపం ఇస్తోంది. జీ20 దేశాల అధ్యక్ష స్థానంలో ఉన్న భారత దేశం దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద సావరిన్ క్రెడిటర్ అయిన చైనాను కూడా దీనిలో భాగస్వామిని చేసేందుకు ప్రయత్నిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకున్న దేశాలను ఆదుకునేందుకు భారత దేశం ఓ ప్రణాళికను రూపొందిస్తోంది. చైనా, తదితర రుణదాతలను దీనిలో భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తోంది. రుణదాతలు ఇచ్చిన రుణాలను ఇటువంటి దేశాల నుంచి తిరిగి రాబట్టుకునేటపుడు కొంత వరకు తగ్గించుకునేవిధంగా చేయడమే ఈ ప్రణాళిక ఉద్దేశం.

జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల అధిపతులు వచ్చే వారం బెంగళూరులో సమావేశంకాబోతున్నారు. భారత దేశం ఈ ఏడాది జీ20 ప్రెసిడెన్సీని నిర్వహిస్తోంది. ఈ కాలంలో జరిగే అతి ముఖ్యమైన కార్యక్రమం ఇదే కాబోతోంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి.

ఇదిలావుండగా, సంక్షోభంలో చిక్కుకున్న దేశాలను ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) కూడా ప్రయత్నిస్తోంది. ప్రపంచ బ్యాంకు, భారత దేశం, చైనా, సౌదీ అరేబియా, అమెరికా, ఇతర జీ7 దేశాలతో శుక్రవారం ఓ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల రుణాలను రీస్ట్రక్చర్ చేయడానికి తగిన నియమాలను రూపొందించడంపై చర్చించబోతోంది.

భారత దేశం చేస్తున్న ప్రయత్నాలపై స్పందించేందుకు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ప్రస్తుతం మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకను మన దేశం అన్ని విధాలుగా ఆదుకుంటోంది.

Updated Date - 2023-02-15T16:18:13+05:30 IST