G7 Summit : ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి : మోదీ
ABN , First Publish Date - 2023-05-19T12:00:14+05:30 IST
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఉమ్మడిగా పరిష్కరించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
న్యూఢిల్లీ : ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఉమ్మడిగా పరిష్కరించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. ఈ విషయాన్ని తాను జపాన్‌లో జరిగే జీ7 దేశాల అధినేతలు, ఇతర భాగస్వాములకు చెబుతానన్నారు. మూడు దేశాల పర్యటనకు ఆయన శుక్రవారం బయల్దేరారు.
మోదీ జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటిస్తారు. ఆయన శుక్రవారం బయల్దేరే ముందు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో, మోదీ జీ7 సదస్సుకు హాజరవుతారని తెలిపింది. జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడ (Fumio Kishida) ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపింది. ఈ సదస్సు జపాన్ అధ్యక్షతన జరుగుతున్నట్లు తెలిపింది. మోదీ, కిషిడ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని పేర్కొంది. కిషిడ మన దేశంలో మార్చిలో పర్యటించిన విషయాన్ని గుర్తు చేసింది.
జీ20 సదస్సుకు ఈ సంవత్సరం మన దేశం అధ్యక్షత వహిస్తోందని, అందువల్ల జీ7 సదస్సులో తాను పాల్గొనడం చాలా ముఖ్యమైనదని మోదీ ఈ ప్రకటనలో తెలిపారు. జీ7 దేశాల అధినేతలతోనూ, ఈ సదస్సులో పాల్గొనే ఇతర దేశాల అధినేతలతోనూ తాను తన అభిప్రాయాలను పంచుకుంటానని తెలిపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించడానికి సమష్టిగా కృషి చేయవలసిన అవసరం గురించి తన అభిప్రాయాలను వారికి తెలియజేస్తానన్నారు.
జపాన్‌లోని హిరోషిమాలో మే 19 నుంచి 21 వరకు జరిగే జీ7 సదస్సుకు హాజరయ్యే కొందరు నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మూడు ఔట్‌రీచ్ సెషన్స్ జరుగుతాయి. ఆహారం, ఆరోగ్యం, అభివృద్ధి, స్త్రీ-పురుష సమానత్వంపై ఒక సెషన్ జరుగుతుంది. వాతావరణం, ఇంధనం, పర్యావరణంపై మరొక సెషన్ జరుగుతుంది. మూడో సెషన్ శాంతియుత, సుస్థిర, సౌభాగ్యవంతమైన ప్రపంచం గురించి జరుగుతుంది. జపాన్ ఆహ్వానించిన ఎనిమిది దేశాల్లో భారత్ ఒకటి. ఈ సెషన్స్‌లో మోదీ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మోదీ జపాన్ నుంచి పపువా న్యూగినియా వెళ్తారు. పోర్ట్ మోర్స్‌బైలో ఇండియా-పసిఫిక్ దీవుల సహకార వేదిక మూడో సదస్సుకు పపువా న్యూగినియా ప్రధాన మంత్రి జేమ్స్ మరపేతో కలిసి సహ ఆతిథ్యం ఇస్తారు. భారత దేశ ప్రధాన మంత్రి పపువా న్యూగినియాలో పర్యటించడం ఇదే తొలిసారి. పసిఫిక్ దీవుల దేశాలు 14 ఉన్నాయని, ఈ అన్ని దేశాలు ఈ ముఖ్యమైన సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకరించడం సంతోషమని మోదీ తెలిపారు. 2014లో ఫిజీలో తాను పర్యటించినపుడు ఎఫ్ఐపీఐసీని ప్రారంభించినట్లు తెలిపారు. మనల్ని కలిపే అంశాలపై ఈ దేశాల నేతలతో మాట్లాడటానికి తాను ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, శిక్షణ, ఆరోగ్యం, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ద్వైపాక్షిక చర్చల కోసం మోదీని ఆహ్వానించారు. మోదీ పపువా న్యూ గినియా నుంచి ఆస్ట్రేలియా వెళ్తారు. భారత్-ఆస్ట్రేలియా వార్షిక సమావేశం న్యూఢిల్లీలో మార్చిలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును పరిశీలించేందుకు ప్రస్తుత మోదీ పర్యటన ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి :
UK parliament : బ్రిటన్ పార్లమెంటు భవనం కూలిపోబోతోందా?
Kozhikode train arson case: నిందితుడి అరెస్ట్ సమాచారాన్ని లీక్ చేసిన ఐపీఎస్ అధికారి సస్పెన్షన్