Vasundhara Raje: నాపై సీఎం కుట్ర చేస్తున్నారు... గెహ్లాట్‌పై వసుంధర సీరియస్

ABN , First Publish Date - 2023-05-08T11:41:41+05:30 IST

దౌల్‌పూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌లో తిరుగుబాట్లతో ఆయన సతమతమవుతున్నారనడానికి ఆయన ప్రకటనలే నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధరా రాజే అన్నారు. అశోక్ గెహ్లాట్ ఇచ్చిన ప్రకటనపై మండిపడ్డారు. తనపై ఆయన చేసిన ప్రకటనను ఒక కుట్రగా ఆమె పేర్కొన్నారు.

Vasundhara Raje: నాపై సీఎం కుట్ర చేస్తున్నారు... గెహ్లాట్‌పై వసుంధర సీరియస్

దౌల్‌పూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌లో తిరుగుబాట్లతో ఆయన సతమతమవుతున్నారనడానికి ఆయన ప్రకటనలే నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధరా రాజే (Vasundhara Raje) అన్నారు. అశోక్ గెహ్లాట్ ఇచ్చిన ప్రకటనపై మండిపడ్డారు. తనపై ఆయన చేసిన ప్రకటనను ఒక కుట్రగా ఆమె పేర్కొన్నారు.

ధోల్‌పూర్‌లో ఆదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో గెహ్లాట్ మాట్లాడుతూ, 2020 సంక్షోభానికి కేంద్రంలోని బీజేపీ మంత్రులు కొందరు కుట్ర పన్నారని, అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి వసుంధరా రాజే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహ ఇష్టపడలేదని చెప్పారు. ఆ కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బతికి బట్టకట్టిందని అన్నారు. తిరుగుబాటుకు సిద్ధపడి బీజీపీ నుంచి డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేలకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయమని, అందువల్ల వారిపై ఎలాంటి ఒత్తfడి ఉంటుందని కూడా తాను విజ్ఞప్తి చేశానని అన్నారు.

కాగా, గెహ్లాట్ చేసిన ప్రకటనను వసుంధరా రాజే ఖండించారు. గెహ్లాట్ తనపై చేసిన ప్రకటన ఒక కుట్ర అని, గెహ్లాట్‌ అవమానించినంతగా తనను ఎవరూ అవమానించలేదని అన్నారు. సొంత పార్టీలో కుంపటి రాజుకోవడంతో 2023 ఎన్నికల్లో గెలవమనే భయంతోనే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

సంక్షోభం ఇలా..

అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 2020 జూలైలో సంచలన ప్రకటన చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ అప్పట్లో ఖండించింది. 2020కి ముందు నుంచే గెహ్లాట్, పైలట్ మధ్య విభేదాలు తలెత్తాయి. పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, రాష్ట్ర కాంగ్రెస్ పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి ఆయన గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లో బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించడంలో గెహ్లాట్ విఫలమయ్యారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఒకరోజు నిరాహార దీక్షకు కూడా దిగారు. దీంతో అధిష్ఠానం వీరిమధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక సమవేశం ఏర్పాటు చేసినట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున పార్టీలో విభేదాలు తగదని కాంగ్రెస్ హితవు చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి ముందు గెహ్లాట్‌కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి పదవిని కట్టబెట్టి, పైలట్‌కు రాజస్థాన్ సీఎం పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. అయితే, రాష్ట్ర పగ్గాలు వదులుకునేందుకు గెహ్లాట్ అంగీకరించకుండా పైలట్ ఆశలపై నీళ్లు చల్లారు. ఈ ఇద్దరు నేతల మధ్య గతంలోనూ పలుమార్లు విభేదాలు తలెత్తాయి.

Updated Date - 2023-05-08T11:41:46+05:30 IST