ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌.. నేడు సీఎం పయనం

ABN , First Publish Date - 2023-04-27T08:40:38+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) బుధవారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.

ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌.. నేడు సీఎం పయనం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) బుధవారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్ళిన గవర్నర్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు. ఢిల్లీలో మూడు రోజులపాటు ఆయన బస చేయనున్నారు. ఆ సందర్భంగా కేంద్రప్రభుత్వంలోని కొంతమంది పెద్దలను కలుసుకుంటారని తెలుస్తోంది. డీఎంకే(DMK) ప్రభుత్వం గత యేడాది నుంచి జనవరి వరకూ శాసనసభలో రూపొందించిన 17 బిల్లులు గవర్నర్‌ పరిశీలనలో ఉన్నాయి. ఈ బిల్లులకు ఆయన ఆమోదం తెలుపకుండా పెండింగ్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఇటీవలి శాసనసభ సమావేశాల్లో 16 బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపారు. దీంతో గవర్నర్‌ వద్ద 33 బిల్లులు పెండింగ్‌లో వున్నట్లయింది. ఈ బిల్లుల్లో కొన్ని కీలకమైన వాటి గురించి గవర్నర్‌ కేంద్ర మంత్రులతోనూ చర్చించే అవకాశముంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ‘డీఎంకే ఫైల్స్‌’ పేరుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సహా పలువురు మంత్రుల ఆస్తుల జాబితాలను వెల్లడించిన విషయంపై కూడా ఆయన కేంద్రమంత్రులతో చర్చించే అవకాశముంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన శుక్రవారం రాత్రి చెన్నైకి తిరిగివస్తారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

నేడు సీఎం పయనం....

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి ఢిల్లీకి పయనమవుతున్నారు. శుక్రవారం ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకోనున్నారు. ఆ nani4.2.jpgసందర్భంగా గిండిలో రూ.230కోట్లతో నిర్మించిన వెయ్యి పడకల మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించనున్నారు. అదే సమయంలో నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు కోరుతూ శాసనసభలో చేసిన బిల్లుకు ఆమోదం తెలపాలని, క్రైస్తవమతం స్వీకరించిన ఆది ద్రావిడులకు ఎస్టీ రిజర్వేషన్‌ కల్పించాలని కూడా ఆయన కోరనున్నారు. రాష్ట్రపతిని కలుసుకున్న తర్వాత ఆయన ఢిల్లీలో పార్టీ ఎంపీలు, స్థానిక శాఖ నాయకులు, డీఎంకే మిత్రపక్షాల నాయకులను కూడా కలుసుకునే అవకాశం ఉందని డీఎంకే నేతలు తెలిపారు.

Updated Date - 2023-04-27T08:40:38+05:30 IST