Karnataka Assembly Elections: మరో ఆసక్తికర పోటీ.. తలపడుతున్న గురుశిష్యులు

ABN , First Publish Date - 2023-04-21T21:54:37+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ (Hubli Dharwad Central seat) నుంచి ఆసక్తికర పోటీ జరగనుంది.

 Karnataka Assembly Elections: మరో ఆసక్తికర పోటీ.. తలపడుతున్న గురుశిష్యులు
Guru disciple battle in Hubli Dharwad Central seat Karnataka Assembly Elections

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ (Hubli Dharwad Central seat) నుంచి ఆసక్తికర పోటీ జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి గురుశిష్యులు తలపడుతున్నారు. బీజేపీ అధిష్టానంపై తిరుగుబాటు చేసి బయటకు వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (Jagdish Shettar) ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. శెట్టర్ శిష్యుడైన యువ నాయకుడు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్‌ని (Mahesh Tenginkai) బీజేపీ రంగంలోకి దించింది.

ఇద్దరూ లింగాయత్ నేతలే కావడంతో పోటీపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ నుంచి గత ఎన్నికల్లో శెట్టర్ గెలిచారు. ఆరుసార్లుగా ఓటమి ఎరుగరు. సర్వేలన్నీ తానే గెలుస్తున్నట్లు వెల్లడించాయని, అయినా బీజేపీ తనకు టికెట్ ఎందుకీయలేదని శెట్టర్ వాపోతున్నారు. ఇదే విషయంపై ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ( BJP national president JP Nadda) సమావేశమై చర్చించారు. అయినా శెట్టర్‌కు టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ పంచన చేరారు. 67 ఏళ్ల వయసులో శెట్టర్ పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చింది.

మరోవైపు నామినేషన్ వేసే ముందు మహేశ్ తన గురువైన శెట్టర్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గురువు ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని మహేశ్ చెప్పారు.

అయితే మహేశ్‌కు తాను గురువు కాదని శెట్టర్ చెప్పారు. మహేశ్‌కు అసలైన గురువు బీఎల్ సంతోష్ అని శెట్టర్ చెప్పారు. ఆయన వల్లే మహేశ్‌కు టికెట్ లభించిందన్నారు. అయితే మహేశ్‌కు టికెట్ లభించినంత మాత్రానే గెలిచినట్లు కాదని శెట్టర్ చెప్పారు.

బీజేపీలో చేరిన లింగాయత్ వర్గ పెద్ద నాయకుల్లో శెట్టర్‌తో పాటు కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది కూడా ఉన్నారు.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-23T16:25:10+05:30 IST