NDA: ఎన్డీయేలోకి మరో కీలక రాజకీయ పార్టీ.. ఆల్‌మోస్ట్ చేరిపోయినట్టే..!

ABN , First Publish Date - 2023-07-17T11:27:39+05:30 IST

దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేడు, రేపు పోటాపోటీగా అధికార విపక్షాల కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు బెంగళూరులో విపక్షాలు భేటీ అవుతుండగా, రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఇవి రెండూ కీలక సమావేశాలే కావడం గమనార్హం.

NDA: ఎన్డీయేలోకి మరో కీలక రాజకీయ పార్టీ.. ఆల్‌మోస్ట్ చేరిపోయినట్టే..!

న్యూఢిల్లీ/బెంగళూరు: దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేడు, రేపు పోటాపోటీగా అధికార విపక్షాల కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈరోజు, రేపు బెంగళూరులో విపక్షాలు భేటీ అవుతుండగా, రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఇవి రెండూ కీలక సమావేశాలే కావడం గమనార్హం. విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. విపక్ష భేటీలో కూటమికి కొత్త పేరు, సమన్వయకర్తల నియామకం, సీట్ల సర్దుబాటు కోసం కమిటీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది.

ఢిల్లీ ఆర్డినెన్స్, యూసీసీ, ద్రవ్యోల్బణం, విదేశాంగ విధానం, నిరుద్యోగం తదితర అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టే వ్యూహంపైనా విపక్ష నేతలు చర్చించనున్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్దతిచ్చిన నేపథ్యంలో విపక్ష భేటీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరవుతుండటం విశేషం. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ వైఖరి అంతుచిక్కడం లేదు. బీజేపీతో జేడీఎస్‌ మైత్రి ఏర్పాటు చేసుకుంటుందనే ప్రచారం నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఢిల్లీ వెళుతున్నాతారనే చర్చ జోరందుకుంది. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత జేడీఎస్‌తో కలసి వెళ్లాలనే ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే.


బీజేపీయేతర పార్టీలు సోమవారం నుంచి బెంగళూరులో రెండు రోజుల సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌తో సన్నిహితంగా వ్యవహరించిన జేడీఎస్‌ ఈ సమావేశానికి దూరంగా ఉండాలని భావిస్తోంది. మరోవైపు ఈనెల 18న ఎన్డీయే మైత్రి కూటమిలో జేడీఎస్‌ నేత కుమారస్వామి పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం ఆయన ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్రం వీడని కుమారస్వామి ఒక్కసారిగా హస్తిన వైపు వెళ్లడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై, జేడీఎస్‌తో మైత్రి విషయం తమకు తెలియదని అధిష్టానం నిర్ణయిస్తుందని బెంగళూరులో తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఢిల్లీ నేతలు రాష్ట్రంలో జేడీఎస్‌తో పొత్తు విషయం తెలపలేదన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

jds.jpg

తాజాగా.. సోమవారం నాడు జేడీఎస్ నేత కుమారస్వామి మాట్లాడుతూ.. విపక్షాలు జేడీఎస్‌ను తమ భాగస్వామిగా భావించ లేదని, విపక్షాల మహాకూటమిలో జేడీఎస్ చేరే ప్రశ్నకే తావు లేదని కుండబద్ధలు కొట్టారు. కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్డీయేలో కుమారస్వామి భాగం కాబోతున్నారనే అనుమానాలకు తావిచ్చాయి. ఎన్డీయే తమను ఎలాంటి సమావేశానికీ ఆహ్వానించలేదని చెప్పిన కుమారస్వామి, ఆ ఫ్రంట్‌నూ చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, కుమారస్వామి తాజా వ్యాఖ్యలు గమనిస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసి ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీని ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-07-17T11:28:33+05:30 IST