Share News

Akasa Air flight: 'నా బ్యాగ్‌లో బాంబు ఉంది' అని ప్రయాణికుడి బెదిరింపులు.. విమానం అత్యవసరంగా ల్యాండింగ్.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-10-21T13:28:21+05:30 IST

కొన్నిసార్లు విమానాల్లో ప్రయాణికులు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. తమ చేష్టలతో తోటి ప్రయాణికులతోపాటు విమాన సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

Akasa Air flight: 'నా బ్యాగ్‌లో బాంబు ఉంది' అని ప్రయాణికుడి బెదిరింపులు.. విమానం అత్యవసరంగా ల్యాండింగ్.. అసలు ఏం జరిగిందంటే..?

కొన్నిసార్లు విమానాల్లో ప్రయాణికులు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. తమ చేష్టలతో తోటి ప్రయాణికులతోపాటు విమాన సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి పూణే నుంచి ఢిల్లీకి వెళ్లే ఆకాసా విమానం బయలుదేరింది. విమానంలో 185 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. కానీ ఇంతలోనే ఓ ప్రయాణికుడు “నా బ్యాగ్‌లో బాంబు ఉంది” అని అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. వెంటనే విమానాన్ని ల్యాండింగ్ చేయాలని హెచ్చరించాడు. దీంతో అర్దరాత్రి 12.42 గంటలకు ముంబై విమానశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్స్ (BDDS) బృందాన్ని పిలిపించి, విమానంలో అతని బ్యాగ్‌ని తనిఖీ చేశారు. కానీ ఆ బ్యాగులో ఎలాంటి బాంబు దొరకలేదు. దీంతో బాంబు ఉందని అందరినీ భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయించిన ఆ ప్రయాణికుడిని విమానాశ్రయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.


ఈ మేరకు ఆకాసా ఎయిర్ విమానం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. “1148 నంబర్ గల ఆకాసా ఎయిర్ విమానం క్యూపీ అక్టోబర్ 21న అర్ధరాత్రి 12.07 గంటలకు పూణె నుంచి బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 185 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం సెక్యూరిటీ అలర్ట్ అందుకుంది. దీంతో భద్రతా విధానాల ప్రకారం విమానాన్ని ముంబైకి మళ్లించారు. కెప్టెన్ అవసరమైన అన్ని అత్యవసర విధానాలను అనుసరించాడు. 12.42 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని కెప్టెన్ సురక్షితంగా ల్యాండ్ చేశాడు”అని అకాసా ఎయిర్ ప్రకటనలో పేర్కొంది. ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సీఐఎస్ఎఫ్ అధికారి ఈ సంఘటన గురించి ముంబై పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు తెల్లవారుజామున 2.30 గంటలకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆ విమానంలోని ప్రయాణీకుడి బ్యాగును బీడీడీఎస్ అధికారులతోపాటు పోలీస్ అధికారులు తనఖీ చేశారు. అయితే ఆ తనిఖీలో పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఆ విమానంలో నిందితుడు ప్రయాణికుడితోపాటు అతని బంధువు కూడా ప్రయాణిస్తున్నాడు. అతను ఛాతీ నొప్పికి మందు తాగినట్లు చెప్పాడు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఉదయం 6 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి విమానం ఢిల్లీకి బయలుదేరింది. ముంబై పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-10-21T14:13:04+05:30 IST