Uniform Civil Code : యూసీసీని సమర్థించిన హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మంత్రిపై బీజేపీ ప్రశంసలు
ABN , First Publish Date - 2023-07-02T12:39:22+05:30 IST
ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)పై చర్చ వేగం పుంజుకుంది. ఒకే పార్టీకి చెందిన నేతలు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మిత్రపక్షాలు కూడా విభిన్న వాదనలను వినిపిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) యూసీసీని సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో మాట్లాడారు.
సిమ్లా (హిమాచల్ ప్రదేశ్) : ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)పై చర్చ వేగం పుంజుకుంది. ఒకే పార్టీకి చెందిన నేతలు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మిత్రపక్షాలు కూడా విభిన్న వాదనలను వినిపిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ పీడబ్ల్యూడీ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) యూసీసీని సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో మాట్లాడారు. బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వెంటనే స్పందించి విక్రమాదిత్యను ప్రశంసించారు. ఆయన తన అంతరాత్మ ప్రబోధాన్ని విన్నారని, దానినే ఆయన వెల్లడించారని అన్నారు.
జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ, విక్రమాదిత్య యూసీసీకి మద్దతుగా మాట్లాడారంటే, ఆయన తన అంతరాత్మ ప్రబోధాన్ని విన్నారని, దానినే ఆయన వ్యక్తం చేశారని అర్థం చేసుకోవాలన్నారు. వేర్వేరు రాజకీయ పార్టీలు, విభిన్న భావజాలాలు కలవారు చాలా మంది యూసీసీకి మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. యూసీసీ గురించి చర్చ జరిగినపుడు, వివిధ రాజకీయ పార్టీలు, విభిన్న భావజాలాలు కలవారి అంతరాత్మ వారికి ఓ విషయాన్ని చెబుతుందన్నారు. యూసీసీ అనేది దేశ, సమాజ ప్రయోజనాల కోసమేనని వారి అంతరాత్మ వారికి చెప్తుందన్నారు. అందరికీ ఒకే చట్టం ఉండాలని తాము ఎల్లప్పుడూ డిమాండ్ చేస్తున్నామన్నారు.
అంతకుముందు విక్రమాదిత్య మాట్లాడుతూ, యూసీసీని కాంగ్రెస్ సమర్థిస్తుందన్నారు. ఐకమత్యం, సమగ్రతలను మరింత ప్రోత్సహించేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించడానికే దీనిపై బీజేపీ చర్చను ప్రారంభించిందని ఆరోపించారు. దాదాపు ఓ నెల నుంచి మణిపూర్ తగులబడుతోందని, అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి కనిపిస్తోందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇప్పటికీ బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. దేశంలో వాస్తవ సమస్యల గురించి బీజేపీ నోరు మెదపదన్నారు. విక్రమాదిత్య ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభ సింగ్ తనయుడు. అదే విధంగా ఆయన తండ్రి దివంగత వీరభద్ర సింగ్ ఈ రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు.
విక్రమాదిత్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ స్పందిస్తూ, తమ పార్టీ వ్యూహ నిర్ణయ సమావేశంలో తీసుకునే నిర్ణయమే అంతిమమని, దీనికి భిన్నంగా ఎటువంటి అభిప్రాయానికి ప్రాధాన్యం లేదని చెప్పారు. యూసీసీపై వ్యూహాన్ని నిర్ణయించేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యూసీసీ ముసాయిదా వచ్చిన తర్వాత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ మిత్ర పక్షం సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)కు మద్దతు ప్రకటించింది. శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీలు దీనికి మద్దతిస్తున్నాయి. దీనిని కాంగ్రెస్, డీఎంకే, జేడీయూ, నేషనల్ కాన్ఫరెన్స్, వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షం ఎన్‌పీపీ దీనిని వ్యతిరేకిస్తోంది. మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధ్యక్షుడు కాన్రాడ్ కె.సంగ్మా (Conrad K.Sangma) మాట్లాడుతూ, భారతదేశ వాస్తవ ఆలోచనకు యూసీసీ విరుద్ధమని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్
Pakistan : భారత్‌లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ కొత్త వ్యూహాలు