Rahul Gandhi Vs Himanta : రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేస్తా : హిమంత బిశ్వ శర్మ
ABN , First Publish Date - 2023-04-09T21:28:11+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పరువు నష్టం దావా వేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
గువాహటి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పరువు నష్టం దావా వేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) ఆదివారం చెప్పారు. రాహుల్ ఇచ్చిన ట్వీట్ పరువు నష్టం కలిగించే విధంగా ఉందన్నారు. ఏప్రిల్ 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అస్సాం పర్యటన పూర్తయిన తర్వాత గువాహటిలో గాంధీపై కేసు దాఖలు చేస్తామన్నారు.
రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)తో హిమంత బిశ్వ శర్మకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. సత్యాన్ని దాచిపెట్టారని, అందుకే వారు ప్రతి రోజూ తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. అదానీ కంపెనీల్లో రూ.20,000 కోట్లు బినామీ సొమ్ము ఎవరిదనే ప్రశ్న ఇంకా మిగిలే ఉందన్నారు. కొందరు నాయకుల పేర్లను అదానీకి జత చేస్తూ ఓ చిత్రాన్ని పోస్ట్ చేశారు. గులాం, సిండియా, కిరణ్, హిమంత, అనిల్ అనే పేర్లు ఈ చిత్రంలో కనిపించాయి.
దీనిపై హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, అస్సాం బోహాగ్ బిహు ఉత్సవాల కోసం సిద్ధమవుతోందని, ఈ సమయంలో తాను దీనిపై చర్చించబోనని చెప్పారు. ఏప్రిల్ 14న అస్సామీస్ నూతన సంవత్సర ప్రారంభం రోజు అని, ఆ తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గురించి ప్రస్తావిస్తూ, ఢిల్లీ రాష్ట్రంలో 1,50,000 మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతి ఉందని, అలాంటపుడు కేజ్రీవాల్ ప్రభుత్వం 12 లక్షల ఉద్యోగాలను ఎలా కల్పించిందో నిరూపించడానికి కేజ్రీవాల్ ఎప్పుడు ఆహ్వానిస్తారోనని ఎదురు చూస్తున్నానని చెప్పారు. అస్పాంలో 4 లక్షల మంది ఉద్యోగులను నియమించడానికి అనుమతి ఉందని, అలాంటపుడు 12 లక్షల మందికి ఎలా ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు. ఈ మిస్టరీని ఛేదించాలనుకుంటున్నానని చెప్పారు.
కేజ్రీవాల్ గువాహటిలో ఏప్రిల్ 2న బహిరంగ సభలో మాట్లాడుతూ, గడచిన ఎనిమిదేళ్లలో ఢిల్లీలో 12 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
PM Modi : ‘ది ఎలిఫెంట్ విస్పరర్’ జంట బొమ్మన్, బెల్లీలతో మోదీ మాటమంతి
Tigers : దేశంలో పులుల సంఖ్య పెరిగింది : మోదీ