NIA : లండన్‌లో ఇండియన్ హై కమిషన్‌పై దాడి కేసు ఎన్ఐఏకు అప్పగింత
ABN , First Publish Date - 2023-04-18T16:18:55+05:30 IST
లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై మార్చి 19న సిక్కు తీవ్రవాదులు దాడి చేయడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
న్యూఢిల్లీ : లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై మార్చి 19న సిక్కు తీవ్రవాదులు దాడి చేయడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత దేశాన్ని అవమానించినవారిని చట్టబద్ధంగా శిక్షించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ కార్యాలయంపై సిక్కు తీవ్రవాదులు దాడి చేసి, విధ్వంసం సృష్టించి, జాతీయ జెండాను అవమానించడాన్ని ఎంత మాత్రం సహించేది లేదని బ్రిటన్ ప్రభుత్వానికి తెగేసి చెప్పింది. ఈ హింసాత్మక దాడి కేసు దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్పగించింది.
ఢిల్లీ పోలీసులను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, సిక్కు రాడికల్స్ దాడిలో ఇద్దరు ఇండియన్ హై కమిషన్ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ హింసాత్మక సంఘటనలు జరిగినపుడు అక్కడే ఉన్న లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ అధికారి ఫిర్యాదు మేరకు స్పెషల్ సెల్ మార్చి 23న కేసును నమోదు చేసింది. దీనిపై దర్యాప్తు బాధ్యతను ఏప్రిల్ 13న ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదేశాలు జారీ చేసింది.
దీంతో ఐపీసీ సెక్షన్లు 109/147/148/149/120-B/448/452/325 రెడ్ విత్ యూఏపీఏ సెక్షన్ 13, ప్రభుత్వ ఆస్తులకు నష్ట కలిగించడాన్ని నిరోధించే చట్టంలోని సెక్షన్ 3(1), ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్స్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం ఎన్ఐఏ కేసును నమోదు చేసింది.
సిక్కు తీవ్రవాదులు అవతార్ సింగ్ వురపు ఖండా, గురుచరణ్ సింగ్, జస్వీర్ సింగ్ ఈ కేసులో ముఖ్యమైన అనుమానితులని ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తెలిపింది. దాదాపు 60 మంది వేర్పాటువాదులు తమ కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టిస్తున్నారని, రక్షించాలని ఇండియన్ హై కమిషన్ అధికారులు డిప్లమేటిక్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌కు ఫోన్ చేసినట్లు పేర్కొంది. వీరంతా ఖండా, గురుచరణ్‌ల నాయకత్వంలోనే దాడులకు పాల్పడినట్లు తెలిపింది. వీరిద్దరితోపాటు జస్వీర్ సింగ్ భారత జాతీయ జెండాను అవమానించడంతోపాటు విధ్వంసం సృష్టించినట్లు ఇండియన్ హై కమిషన్ అధికారులు గుర్తించినట్లు తెలిపింది. ఇంత విధ్వంసం జరుగుతున్నా లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు స్పందించలేదని ఇండియన్ అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా, సిక్కు తీవ్రవాదులు ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై దాడి చేయడాన్ని, భారత జాతీయ జెండాను అవమానించడాన్ని బ్రిటన్ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది. నిరసన తెలిపే హక్కు, వాక్ స్వాతంత్ర్యం ఉన్నాయని చెప్పింది. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఈ సంఘటనను తేలిగ్గా తీసుకోలేదు. బ్రిటన్‌తో భవిష్యత్తులో సంబంధాలకు దీనిని ముడిపెట్టింది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నవారిపై స్పష్టమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటోంది. ఖండా తల్లిదండ్రులు 1990వ దశకంలో పంజాబ్‌లో ఉగ్రవాదానికి పాల్పడ్డారని, వీరికి పాకిస్థాన్ ఐఎస్ఐ అండదండలు అందించిందని చెప్పింది. ఖండా తల్లిదండ్రులు కేఎల్ఎఫ్ తీవ్రవాదులని తెలిపింది. ఖండా స్టూడెంట్ వీసాపై బ్రిటన్ వెళ్ళినట్లు తెలిపింది. భారత దేశంలో సిక్కులు మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారని, తమకు బ్రిటన్‌లో ఆశ్రయం ఇవ్వాలని కోరుతున్నాడని వివరించింది.
ఇవి కూడా చదవండి :
Supreme Court : అతిక్-అష్రఫ్ హత్యలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Mukul Roy : టీఎంసీ కీలక నేత ముకుల్ రాయ్ ఆచూకీ తెలిసింది