Mann vs Sidhu: సంచలన నిజం బయటపెట్టిన సిద్ధూ భార్య
ABN , First Publish Date - 2023-06-09T16:29:08+05:30 IST
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన విషయం బయటపెట్టారు. పంజాబ్‌కు సారథ్యం వహించాలని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సిద్ధూను కోరారని అన్నారు.
ఛండీగఢ్: కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Baghawant Mann) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ (Navjot Kaur) సంచలన విషయం బయటపెట్టారు. పంజాబ్‌కు సారథ్యం వహించాలని అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్వయంగా సిద్ధూను కోరారని, అయితే పార్టీకి (Congress) ద్రోహం చేయడానికి సిద్ధూ ఇష్టపడలేదని చెప్పారు. ''మీరు (భగవంత్ మాన్) కూర్చున్న ముఖ్యమంత్రి సీటు మీ సోదరుడు (సిద్ధూ) మీకు ఇచ్చిన కానుక అనే విషయం ముందు మీరు గ్రహించాలి'' అని భగవంత్ మాన్‌ను ఉద్దేశించి కౌర్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించి భగవంత్ మాన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు.
''ముఖ్యమంత్రి భగవంత్ మాన్... మీ ట్రెజర్ హంట్‌లోని ఓ సీక్రెట్‌ను ఇవాళ బయటపెడుతున్నాను. మీరు పొందిన గౌరవ స్థానం (సీఎం సీటు) మీ సోదరుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మీకు ఇచ్చిన కానుకేనని గుర్తించండి. మీ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడే స్యయంగా పంజాబ్‌కు సారథ్యం వహించాలని సిద్ధూను కోరారు'' అని కౌర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌లో ఆప్ పార్టీకి సారథ్యం వహించాల్సిందిగా వివిధ మార్గాల ద్వారా సిద్ధూను ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారని ఆమె వెల్లడించారు. పంజాబ్ పట్ల సిద్ధూకు ఉన్న అభిరుచి గుర్తించే కేజ్రీవాల్ సంప్రదింపులు సాగించారని, అయితే సొంత పార్టీని వంచించరాదనే కారణంగానే సిద్ధూ అందుకు ఒప్పుకోవలేదని, అందువల్లే మీకు ఒక అవకాశం (సీఎంగా) లభించిందని కౌర్ అన్నారు.
పంజాబ్ సంక్షేమం కోసమే నిరంతరం సిద్ధూ తపన పడుతుంటారని, అందుకోసం ఆయన అన్నీ త్యాగం చేశారని కౌర్ చెప్పారు. ''మీరు (భగవంత్ మాన్) సత్యమార్గాన్ని నమ్మితే ఆయన (సిద్ధూ) మీకు మద్దతిస్తారు. సత్యమార్గాన్ని విస్మరిస్తే మిమ్మల్ని ప్రతిఘటిస్తారు. స్వర్ణ పంజాబ్ సిద్ధూ కల. అందుకోసమే ఆయన జీవిస్తున్నారు'' అని కౌర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
మాన్, సిద్ధూ ఢీ...
విజిలెన్స్ నిఘాలో ఉన్న పంజాబీ డెయిలీ సంపాదకుడికి మద్దతుగా జలంధర్‌లో సమావేశమైన విపక్ష పార్టీలపై భగవంత్ మాన్ ఆదివారంనాడు విమర్శల దాడి ఎక్కుపెట్టారు. దీనిపై సిద్ధూ ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని విజిలెన్స్ సిస్టింగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ నేతల చేతిలో పంజాబ్ పాలకులు రిమోట్ కంట్రోల్‌గా మారారంటూ విమర్శించారు.