INDIA bloc meeting: 'ఇండియా' కూటమి సమావేశం తేదీ ఖరారు..ఎప్పుడంటే..?
ABN , First Publish Date - 2023-12-10T20:26:10+05:30 IST
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పాటు చేసిన 'ఇండియా' కూటమి తదుపరి సమావేశం తేదీ ఖరారైంది. డిసెంబర్ 19వ తేదీన సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలియజేశారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పాటు చేసిన 'ఇండియా' (INDIA) కూటమి తదుపరి సమావేశం తేదీ ఖరారైంది. డిసెంబర్ 19వ తేదీన సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) ఈ విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలియజేశారు. ఇండియా కూటమి నేతల 4వ సమావేశం డిసెంబర్ 19వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు న్యూఢిల్లీలో జరుగుతుందని ఆయన తెలిపారు.
తొలుత ఇండియా కూటమి నేతల సమావేశాన్ని తన నివాసంలో డిసెంబర్ 6న జరిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు. అయితే కీలక నేతలైన బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తమ అసక్తతను తెలియజేయడంతో సమావేశం రద్దయింది. జ్వరం కారణంగా కూటమి సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్టు నితీష్ వివరణ ఇచ్చారు. తదుపరి సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణకు వ్యూహరచన చేస్తామని చెప్పారు. తనకు ముందస్తు సమచారం లేనందున వేరే కార్యక్రమం ఖరారైందని మమతా బెనర్జీ తెలిపారు. కనీసం వారం, పది రోజులకు ముందు తెలియజేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తుఫాను కారణంగా తాను వెళ్లలేకపోతున్నట్టు ఎంకే స్టాలిన్ చెప్పారు.
కాగా, 'ఇండియా' కూటమి తొలి సమావేశం గత జూన్ 23న పాట్నాలో జరుగగా, రెండో సమావేశం జూలై 17-18 తేదీల్లో బెంగళూరులోను, మూడో సమావేశం ఆగస్టు 31-సెప్టెంబర్ 1వ తేదీల్లో ముంబైలోనూ జరిగింది. న్యూఢిల్లీలో ఈనెల 19న జరుగనున్న సమావేశంలో 2024 ఎన్నికల్లో సమష్టిగా పోటీ చేస్తామనే తీర్మానాన్ని కూటమి పార్టీలు ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అన్ని పార్టీలు వ్యవహరించాలనే అంశంపై ఏకాభిప్రాయానికి రానున్నాయి. ''జుడేగా భారత్, జీతేగా ఇండియా'' అనే నినాదంతో ఇండియా బ్లాక్ లోక్‌సభ ఎన్నికలకు వెళ్లనుంది.