Britain Vs India : బ్రిటన్‌కు బుద్ధి చెప్పిన మోదీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-03-22T14:43:30+05:30 IST

లండన్‌లోని భారత దౌత్య కార్యాలయంపై సిక్కు రాడికల్స్ దాడిని నిరోధించడంలో విఫలమైన బ్రిటన్‌కు భారత ప్రభుత్వం గట్టి గుణపాఠం చెప్పింది.

Britain Vs India : బ్రిటన్‌కు బుద్ధి చెప్పిన మోదీ ప్రభుత్వం
Indian High Commission in London

న్యూఢిల్లీ : లండన్‌లోని భారత దౌత్య కార్యాలయంపై సిక్కు రాడికల్స్ దాడిని నిరోధించడంలో విఫలమైన బ్రిటన్‌కు భారత ప్రభుత్వం గట్టి గుణపాఠం చెప్పింది. న్యూఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్‌కు ప్రత్యేక భద్రత హోదాను తొలగించింది. ఈ హోదా ఉండటం వల్ల ఈ కార్యాలయం వద్ద రోడ్ డైవర్టర్, ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్ళడం కోసం రుంబుల్ స్ట్రిప్, స్థానిక పోలీసుల మోహరింపు వంటి సదుపాయాలు అందుతున్నాయి. మన దేశంలోని మరికొన్ని బ్రిటిష్ సంస్థలకు కూడా భద్రతను తగ్గించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.

విదేశాల్లోని ఇండియన్ మిషన్స్‌పై, మరీ ముఖ్యంగా బ్రిటన్‌లోని ఇండియన్ మిషన్స్‌పై తరచూ దాడులు జరుగుతుండటంపై భారత దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై సిక్కు రాడికల్స్ దాడి చేశారు. భారత దేశ జాతీయ జెండాను అవమానించారు. వారిని నిరోధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదు. పోలీసు బృందాలను సకాలంలో పంపించి, దాడిని నిరోధించడంలో బ్రిటన్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత దేశంలోని బ్రిటిష్ హై కమిషన్‌కు స్పెషల్ సెక్యూరిటీ స్టేటస్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు భద్రత అవసరం లేదని తాజా సమీక్షలో అధికారులు నిర్ణయించారు. లండన్‌లో పరిస్థితులు అదుపు తప్పితే, తాము ఏదో ఓ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక అవకాశం ఇదేనని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటీవల విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఇండియన్ కాన్సులేట్‌పై కూడా కొందరు దుండగులు మార్చి 20న దాడికి పాల్పడ్డారు. దీనిపై భారత ప్రభుత్వం స్పందిస్తూ, దౌత్యపరమైన ప్రాతినిధ్యాన్ని కాపాడవలసిన మౌలిక బాధ్యత అమెరికా ప్రభుత్వానికి ఉందని, ఈ విషయాన్ని ఆ ప్రభుత్వానికి గుర్తు చేశామని తెలిపింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపింది.

ఆస్ట్రేలియాలోని కాన్‌బెరాలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఆస్ట్రేలియన్ పార్లమెంటు వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖలిస్థాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్‌, ఆయన మద్దతుదారులపై పోలీసుల చర్యను ఖండించారు.

ఇవి కూడా చదవండి :

Delhi Liquor Policy: సౌత్‌గ్రూపు నిర్దేశించినట్లుగా.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ

Karnataka : ఎన్నికల్లో తాయిలాలకు బదులు ఇలా చేయండి : డాక్టర్ల సలహా

Updated Date - 2023-03-22T14:43:30+05:30 IST